
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లు పెంచే కుట్ర జరుగుతోందని, దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరిగి దక్షిణాది ఓటర్లతో పనిలేకుండా గెలవాలనే ఎత్తుగడకు కేంద్రం తెరలేపిందని విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తున్నాయి. ఈ నెల 22న చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
సౌత్‌లోని కేరళ, కర్నాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు ఆ సమావేశానికి హాజరు కానున్నారు. ఇప్పటికే పన్నుల వాటాలకు సంబంధించి విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపైన కేంద్రం వివక్షపై చాలాకాలంగా పోరాడుతున్నారు. ఇప్పుడు వీరు మరోసారి కేంద్రం మీద పోరు సైరన్ ఊదనున్నారు.
కేంద్రానికి రూపాయి ఇస్తే తిరిగి 42 పైసలు ఇస్తున్నారంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ధిక్కార స్వరాన్ని వినిపించారు. మరోవైపు బిహార్‌కు రూపాయి ఇస్తే రూ. 7.60 పైసలు, ఉత్తరప్రదేశ్‌కు మూడు రూపాయలు ఇస్తున్నారని, ఇటీవల బడ్జెట్ కేటాయింపులోనూ ఇదే వివక్ష జరిగిందని, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. ఒకవైపు ఆర్థికంగా దేశం కుదేలవుతోంది. స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.87కు పడిపోయింది.
ఉత్తరాదికే ఎక్కువ ప్రయోజనం
తమిళనాడులో హిందీపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సీట్లు తగ్గకుండా డీలిమిటేషన్ చేస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొంటున్నారు. మొత్తానికి సౌత్ ఇండియా అంతా కూడా ప్రస్తుతం ఈ పునర్విభజనపై అసంతృప్తిగా ఉన్నది. పార్లమెంటు సీట్ల ప్రకారమే అసెంబ్లీలోనూ సీట్లు ఉంటాయి.
అటు ఎన్నికల కమిషన్ విషయంలోనూ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అందులో చీఫ్ జస్టిస్‌ను కమిటీ నుంచి తొలగించి.. ప్రధానమంత్రి, మరో మంత్రి, విపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కమిటీలో పెట్టడం జరిగింది. ఇద్దరి అభిప్రాయంతో ఇటీవలనే ఎన్నికల కమిషన్ నియామకం జరిగింది. ఇది కూడా వారి చిత్తం వచ్చినట్లు కేంద్రం చేసుకున్నది. ఎన్నికల కమిషన్ ఎంపికలో రాహుల్ గాంధీ సూచనలను పాటించలేదు. ఇప్పుడు పునర్విభజనకు సంబంధించి కూడా అధికార బీజేపీ అనుకున్నట్లే పునర్విభజన జరగనున్నది.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే భారీగా ఎంపీ సీట్లను పెంచే పరిస్థితి కనిపిస్తున్నది.848 కానున్న లోక్‌సభ సీట్లు మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 543 నుంచి 848కి పెరగబోతోంది. ఇందులో ఒక్క యూపీ, -బిహార్ వాటాయే 222 సీట్లు కానుంది. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు 165, ఇతర రాష్ట్రాల్లో సీట్లు 461 కాబోతున్నాయి. దీంతో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం ఏంటో అర్థమవుతోంది.
ఈ నేపథ్యంలో దక్షిణాదికి అన్యాయం జరగదంటూ కేంద్రం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అయితే, దీనికి విరుగుడుగా జనాభా ఆధారంగా కాకుండా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం ప్రాతిపదికగా విభజన చేయాలని దక్షిణాది రాష్ట్రాలు కోరుతున్నాయి. దీనిపై కేంద్రం స్పందించడం లేదు. ఇప్పటికే పన్నుల వాటా విషయంలో బీజేపీయేతర రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు అని ఆయా రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ వెళ్లి ఆందోళనలు చేసిన దాఖలాలు ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులలోనూ వివక్ష కొనసాగుతోంది. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునే పరిస్థితిలో వారు లేరు.
ఎండి మునీర్, సీనియర్ జర్నలిస్ట్