సంపద కోసం ఆదివాసులకు ద్రోహం!

సంపద కోసం ఆదివాసులకు ద్రోహం!

భారతదేశంలో ఖనిజ సంపద కోసం కక్కుర్తిపడి ఆదివాసుల జీవితాల్లో  పాలకులు నిప్పులు పోస్తున్నారు. అడవి మాత్రమే ఆధారంగా జీవిస్తున్న ఆదివాసుల జీవితాలను ఆగం చేస్తున్నారు. అడవిలోని చెట్టు, చేమ మీద ఆధారపడి జీవించే ఆదివాసీలకు బతుకుతెరువు లేకుండా చేస్తున్నారు. అడవుల యజమానులగా,  అడవిపై హక్కుదారులుగా పిలువబడే అడవి బిడ్డలను ఆగం చేస్తున్నారు. దేశంలోని ఆదివాసీ ప్రాంతంలోని సంపదను ఒకవైపు లూటీ చేస్తూ పర్యావరణానికి పెద్ద ఎత్తున విఘాతం కలిగిస్తున్నారు.  వరదలకు, ప్రకృతి బీభత్సానికి పరోక్షంగా కారణం అవుతూ మరోవైపు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు. ఆదివాసీ, ఏజెన్సీ ప్రాంతాల ప్రజల ఓట్ల కోసం పార్లమెంట్ అసెంబ్లీ సీట్ల కోసం అబద్ధపు అభివృద్ధి సంక్షేమం హామీలు ఇచ్చి పాలకులు బహురూపాల వేషాలు వేస్తూనే ఉన్నారు.

ఆదివాసీల జీవితాల్లో వెలుగురావాలి

ఆదివాసీల బతుకులు బాగుపడాలని పాలకులు, ప్రజాప్రతినిధులు వారితో మమేకం కావాలని ఆదివాసీ జీవితాలలో వెలుగు రావాలని అందరూ భావిస్తారు. కానీ ఇదంతా అబద్ధం.  సంపద కోసం ఓటు బ్యాంకు కోసం తద్వారా అధికారం కోసం నేతలు ఆడే నాటకంగా తెలిసినప్పుడు ఆందోళన కలుగుతుంది. కలుషిత మనుషులు రాజకీయాల మీద వెగటు పుడుతుంది.10 శాతం కూడా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఆదివాసీల బతుకులు బాగుపడలేదు. మారలేదు..మార్చడానికి పాలకులు ప్రయత్నాలు చేయలేదు. ఒక 28 కమిటీలు ఈ దశాబ్దాల కాలంలో స్టడీకి వేశారు. కార్యాచరణ లేదు. నిజానికి దేశంలోని అపారమైన ఖనిజ సంపద ఆదివాసీలు నివసించే అటవీ ప్రాంతంలో నే ఉంది. మన దేశంలోనే 92 శాతం ఖనిజ సంపద  ఉంది. 

ఇప్పటికే కోట్ల చెట్లను లక్షల ఎకరాలలో నరికేసి ఆదివాసీల బతుకుల్లో నిప్పులు పోశారు. దేశంలోని నార్త్ ఈస్ట్ ప్రాంతంలో వీరి పరిస్థితి అతి దయనీయంగా ఉంది .ప్రభుత్వ రేషన్ వీరికి అందడానికి కనీసం ఒక్క రేషన్ దుకాణం కనిపించదు. కాగితాల మీదనే ఆ దుకాణం ఉంటుంది. ఆదివాసీల నుంచి తీసుకున్న భూమి బదులు మరోచోట ఇస్తామన్న హామీ నెరవేరలేదు. నిబంధనల ప్రకారం ఆదివాసీ ప్రాంతంలో  లభించే  సంపదలో వాటా సంగతి అంతే. 10 సంవత్సరాల కాలంలో 18 శాతం పేదరికం పెరిగిన భారత్​లో ..హంగర్ ఇండెక్స్​లోని 116 దేశాల్లో మన స్థానం 101లో ఉంది.

ఆదివాసీల పరిస్థితి మరింత దయనీయం

దేశంలో 10 కోట్ల 44 లక్షలున్న ఆదివాసీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వారి ఆకలిని పంచుకోడానికి  సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్పలాంటి వారు లేక ఆరోగ్యం క్షీణించుతున్నది. లక్షలాది గ్రామాలు ఖాళీ అయ్యాయి.  సంపద కోసం ఖాళీ చేయిస్తున్నారు. రోజుకు లక్షమంది ఆదివాసీలు వలస వెళ్లి ఉపాధి కోసం వెతుక్కునే పరిస్థితి ఉంది.  పోడు వ్యవసాయానికి అటవీశాఖ అడ్డుగోడ అయింది. కోటి ఎకరాలకు పైగా అటవీ భూముల నుంచి ఆదివాసీలు తరిమి వేయబడిన పరిస్థితి ఉంది. తెలంగాణలో ఇటీవలే గిరి పుత్రులకు పోడు వ్యవసాయంలో ఉన్నవారికి సీఎం కేసీఆర్ తన హయాంలో పట్టాలు ఇచ్చారు. ఇది వారి జీవితాల్లో కొంత ఉపశమనం కలిగించే విషయంగా పేర్కొనవచ్చు. 

ఇంకా దేశంలో ఆదివాసీ బిడ్డలు వైద్యం, విద్యకు దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. ఆదివాసీ ప్రాంతాల్లో వైద్య సౌకర్యం లేక రవాణా లేక వాగులు వంకలు దాటలేక వేలాది మంది ఊపిరి వదులుతున్న దాఖలాలు ఉన్నాయి. అడవి మీద ఆధారపడి జీవిస్తున్న అడవి బిడ్డలు 46 శాతం రక్త హీనతతో బాధపడుతున్నారు. పసిపిల్లలు,  గర్భిణీలు ఇందులో 66 శాతం ఉన్నారంటే పౌష్టిక ఆహారం వారికి ఎంత దూరంలో ఉందో తెలుస్తున్నది.  డీప్ ఫారెస్ట్ ఏరియాలో దేశంలో ఒక అంచనా ప్రకారం రానున్న 20 సంవత్సరాల లో 60 లక్షల కోట్ల రూపాయలు ఖనిజ సంపదను వెలికి తీయడం ద్వారా కార్పొరేట్లు సంపాదించనున్నారు. మైనింగ్ కోసం ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న 80 శాతం ఆదివాసీలను బయటకు పంపిస్తున్నారు ఇందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ప్రభుత్వానికి ఇందులో కొంత పన్నులు ఫీజుల ద్వారా అందుతుంది.

 ఆదివాసుల జీవితాల మెరుగు కోసంప్రభుత్వాలు కృషి చేయాలి

 ఆదివాసుల జీవితాల గురించి..పర్యావరణ పరిరక్షణ గురించి పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రకృతి అసమతుల్యం,  వరదలతో వారికి పట్టింపు లేదు.  పది రూపాయలు వారి జేబులోకి వస్తున్నాయి అంటే చాలు పర్యావరణం, ఆదివాసీల బతుకులు పణంగా పెట్టేస్తారు. ఈ దేశం రాజనీతి అదే మరి.  పదేండ్లలో పలు కంపెనీలకు ఆరు లక్షల 50 వేల కోట్లు ప్రయోజనం జరిగింది.  చెట్ల అమ్మకం బిజినెస్ ద్వారా దేశంలో 10 లక్షల కోట్ల రూపాయలు లాభం చేకూరుతుంది.  బొగ్గు..బాక్సైట్​ల ద్వారా ఒక లక్ష 50 వేల నుంచి 2 లక్షల కోట్ల రూపాయల సంపాదన ప్రతి ఏడూ సాధిస్తున్నారు. 

అడవిలో బీడీ ఆకుల సీజన్లో ఒక్కొక్కరు రెండున్నర వేల ఆకులు సేకరిస్తే వారికి లభించేది 75 పైసలే ఇదీ ఆదివాసీల దుస్థితి.  కోల్ ఇండియా కూడా తమకు అన్యాయమే చేస్తుందని 70 శాతం బొగ్గు తవ్వకాలు ఉన్న ఆదివాసీల ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. లక్షల కోట్లు సంపాదించి పెడుతున్న ఆదివాసీల జీవితాల బాగుకోసం రూట్ లెవల్ నుంచి కృషి జరగాలి. ఆ ప్రాంతాల్లోని 121 మంది ఎంపీలు, మరో 350 మందికి పైగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఇందుకు పాటు పడాలి. కనీసం సాటి మనుషులుగా అయినా ఆదివాసీల పట్ల వారి జీవన పరిస్థితుల పట్ల శ్రద్ధ చూపాలి. వారి జీవితాలు మెరుగు కోసం చిత్త శుద్దితో ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి. సంపద కోసం ఆదివాసులకు ద్రోహం తలపెట్టవద్దు!

- ఎండి.మునీర్.సీనియర్ జర్నలిస్ట్