నా భార్య సూసైడ్​కు పుట్టింటోళ్లే కారణం: సీనియర్​ జర్నలిస్ట్​ప్రభు ఆరోపణ

  • దుర్గంచెరువు వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోవడం బాధాకరం
  •  కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపణ

ఖైరతాబాద్, వెలుగు: తన భార్య దుర్గామాధవి ఆత్మహత్యకు ఆమె తల్లిదండ్రులే కారణమని సీనియర్​జర్నలిస్ట్​ప్రభు ఆరోపించారు. శుక్రవారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో కూతురు స్పందనతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘నా భార్య దుర్గామాధవి ఆమె తల్లిదండ్రుల కారణంగా కొంత కాలంగా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వాళ్లు ఆస్తిలో వాటా ఇవ్వకుండా మొత్తం ఆస్తిని కొడుక్కే రాసేశారు. అప్పటి నుంచి తను మానసికంగా కుంగిపోయింది. 

ఈ నెల 2న సూసైడ్​చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి, ఫోన్​ను ఇంట్లో పెట్టి వెళ్లింది. అదే రోజు నేను పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాను. 4న దుర్గం చెరువులో దుర్గామాధవి డెడ్​బాడీ దొరికినట్లు చెప్పారు. దుర్గంచెరువు వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోవడం విచారకరం. టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నామని, కమాండ్​కంట్రోల్​సెంటర్​నుంచి మానిటర్​చేస్తున్నామని పదేపదే పోలీసులు చెబుతున్నారు. మరి దుర్గం చెరువు వద్ద సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయట్లేదు. 

నా భార్య సెల్ఫీ వీడియో నోట్​లేకపోతే పోలీసులు అనుమానంతో నన్నే అరెస్ట్​చేసేవారు. పోలీసులు నా భార్య కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నా భార్యను మానసికంగా ఇబ్బందులకు గురిచేసి, ఆత్మ హత్య చేసుకునేలా వేధించిన జమ్ముగాని వరలక్ష్మి, జమ్ముగాని అనురాధ, జమ్ముగాని దుర్గాప్రసాద్, ఆదినారాయణ, అతడి తమ్ముడు, చెల్లెలుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. సూసైడ్ నోట్​వీడియోలో దుర్గామాధవి నలుగురి పేర్లు చెప్పింది. వీడియో ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవాలి’ అని ప్రభు కోరారు.