మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయాల్లో అనేక చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వాటిలోదే ఎమ్మెల్యేల కొనుగోలు, అమ్మకాల వ్యవహారం. ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలనుకుందని అధికార టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, ఇదంతా కేసీఆర్ మార్గదర్శనంలోనే జరిగిందని ఈ కుట్రకు తమకు ఎలాంటి సంబంధంలేదని బీజేపీ వాదిస్తోంది. వాస్తవాలు ఎలా ఉన్నా అధికార పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుందా అనే సందేహాలు మాత్రం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అక్కడ పట్టుబడిన నిందితులు రామచంద్ర భారతి, సింహాయాజీ, నందకుమార్ లకు బీజేపీలో ఎలాంటి బాధ్యతలు లేవని బీజేపీ స్పష్టం చేసింది. అయితే నిందితుల్లో ఒకరైన నందకుమార్ కేసీఆర్ సమీప బంధువు కంపెనీలో డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలియజేస్తూ ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో 400 కోట్లు చేతులు మారనుందని ఒకసారి, కాదు 100 కోట్లు, 250 కోట్లు అని మరోసారి ఒక్కో మీడియా ఒక్కో రకంగా ప్రచారం చేశాయి. చివరికి రూ.15 కోట్లు పట్టుబడ్డట్లు కూడా పుకార్లు వచ్చాయి. అయితే తనకు రూ.100 కోట్లు ఇవ్వజూపినట్లు రోహిత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి దాకా ఈ విషయాలపై స్పష్టత రాలేదు. ఎక్కడా ఇందుకు సంబంధించిన డబ్బులూ పట్టుబడలేదు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో డబ్బులకు సంబంధించి సరైన సాక్ష్యాలు లేవని, నిందితులను విడుదల చేయాలని ఏసీబీ కోర్టు పోలీసులను ఆదేశించడం టీఆర్ఎస్ కు మింగుడు పడని విషయం. ఇది బీజేపీకి అందివచ్చిన అస్త్రంగా మారింది. ముందే సవాలు విసిరినట్లుగా బండి సంజయ్ తడిబట్టలతో యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి గుడిలో తమ పార్టీకి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేయడం టీఆర్ఎస్ను ఇరుకున పెట్టింది. నందుతో పాటు మరో నిందితుడైన స్వామీజీ కూడా తాము పూజల కోసమే అక్కడికి వచ్చామని, అంతకు మించి తమకు ఏమీ తెలియదన్నట్లు కొన్ని మీడియా చానెళ్ళలో ప్రసారమైంది.
ఆడియో లీకుల్లో నిజమెంత?
ఆ ఫార్మ్ హౌస్ టీఆర్ఎస్ నాయకుడిదే కావడం, అక్కడికే ఎమ్మెల్యేలు బాలరాజు, రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కాంతారావులు రావడం బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్ర చేస్తున్నదని, ఆ కుట్రను భగ్నం చేసినట్లు స్వయంగా టీఆర్ఎస్ ప్రకటించడంతో పలు రకాల సందేహాలు ఆ రోజు నుంచే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ స్వామిజీకి ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు విశ్వసనీయ భక్తుడనే వాదనలు వినిపించాయి. సామ్రాజ్యలక్ష్మీ పూజ చేయించడానికే తాను స్వామిజీని అక్కడికి తీసుకెళ్లానని నందు అదేరోజు మీడియా ముందు స్పష్టం చేశారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు ఆడియో, వీడియో టేపులు కూడా విడుదల చేయనున్నారని ఆ నలుగురు ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడిస్తారంటూ బ్రహ్మాండం బద్దలవ బోతున్నట్లుగా కూడా పలు టీ. వీ. చానెళ్లలో పుకార్లు షికార్లు చేసినప్పటికీ ఆ రోజు ఏమి జరుగలేదు. ఆ తర్వాత మాత్రం కొన్ని ఆడియో టేపులు లీకయ్యాయి. అందులో ఈ కొనుగోళ్ల గురించి బీజేపీలో ప్రధానమైన వ్యక్తుల పేర్లను ఉచ్చరించడంతో బీజేపీ కేంద్ర నాయకులే ఈ తతంగం అంతా నడిపించినట్లు అనుమానాలు రేకెత్తేలాగా సంభాషణలు ఉన్నాయి. అయితే ఎవరో ఎవరి పేర్లో ప్రస్తావిస్తూ మాట్లాడినంత మాత్రాన బీజేపీలోని ఆ ప్రధానమైన వ్యక్తులకు ఇందులో పాత్ర ఉన్నట్లు ఎట్లా అవుతుందని పలువురు రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఆ ఆడియో టేపుల్లో ప్రస్తావించిన పేర్లున్న వారిని కలవాలన్నా, మాట్లాడాలన్నా అంత సులువుగా ఎవరంటే వాళ్ళు కలువలేరు. కొన్ని సందర్భాల్లో కేంద్ర మంత్రులు, రాష్ట్రాల పార్టీల అధ్యక్షులకు కూడా సాధ్యం కాదని బీజేపీ వర్గాలంటున్నాయి. అలాంటిది ఫార్మ్ హౌస్ ఎపిసోడ్ లో ఉన్న నిందితుల్లో ఎవరికీ అంత సీన్ లేదనే విషయం ఎవరికైనా అర్థమవుతుంది. అంతేకాదు వందల కోట్ల వ్యవహారం నడిపేంత స్థాయి ఆ ముగ్గురు నిందితులకు లేదనే విషయం కూడా స్పష్టమవుతుంది. మొత్తం మీద నమ్మిన శిష్యుడే పూజల పేరుతో పిలిపించి మోసం చేసినట్లు స్వామీజీ మాటల ద్వారా అర్థమవుతుంది. ఒకవేళ బీజేపీ కొనుగోలు చేయాలనుకున్నా ఇలా మరోసారి గెలిచే అవకాశాలపై సందేహాలున్న వారిని ఎందుకు ఎంచుకుంటారని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
అదే నిజమైతే..
బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీయే ఈ పథక రచన చేసిందే నిజమైతే పరోక్షంగా టీఆర్ఎస్ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లవుతుంది. ఎందుకంటే మునుగోడు ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుందని, కాబట్టి ఇప్పుడే బీజేపీలో చోటు సంపాదించుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారా అని ప్రజలు అనుమానించే అవకాశాలు ఆ పార్టీయే కల్పించినట్లు కాదా? తద్వారా టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాబోవడం లేదు అని కూడా ఆ పార్టీయే సంకేతాలు ఇచ్చినట్లు కాదా అని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద ఇటీవల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులు పాతాళానికి దిగజారుతున్న రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పార్టీలు ఎంతకైనా దిగజారుతాయని ఈ సంఘటన మరోసారి రుజువుచేస్తోంది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకొని, సంస్కరణలు చేపట్టకపోతే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని ప్రజలు వాపోతున్నారు. దిగజారుతున్న రాజకీయాలకు చరమగీతం పాడి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
ఎమ్మెల్యేలు ప్రగతి భవన్లోనే ఎందుకున్నారు?
అసలు ఈ కుట్రకు ప్రణాళికను రచించిన వ్యక్తులకు ఏ మాత్రం తెలివిలేదనే విషయం ఇలాంటి చిన్న చిన్న అంశాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. దీనిని రచించి, దర్శకత్వం వహించి విడుదల చేసిన ఈ ఫ్లాప్ షోలో బీజేపీ ఇరుక్కోవడం అటుంచి వారు వెంటనే స్పందించి ఎదురుదాడి చేయడంతో టీఆర్ఎస్ పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో చేయాలనుకుంటే మరేదో జరిగి టీఆర్ఎస్ మెడకే చుట్టుకుందంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు ఎందుకు విచారించలేదు? ఈ సంఘటన జరుగగానే ఆ నలుగురు నేరుగా ప్రగతి భవన్ కు ఎందుకు వెళ్ళారు? ఇప్పటికీ బయటి ప్రపంచంలోకి రాకుండా ప్రగతి భవన్లోనే వారు ఎందుకు ఉంచబడుతున్నారు? వారిని సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఆత్మగౌరవం నిలబెట్టారని పొగడటం విమర్శలకు దారితీస్తోంది. ఎందుకంటే ఆ నలుగురిలో ముగ్గురు గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన వారే. అలా చేరిన వారంతా అప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీ బెదిరింపులకు భయపడో, కాంట్రాక్టులు, తమ పనులు చక్కపెట్టుకోవడానికో, డబ్బులకూ అమ్ముడుపోయారని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజల విశ్వాసాన్ని వమ్ముచేసి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన వారిని తెలంగాణ ఆత్మగౌరవం అమ్ముడుపోలేదంటూ కేసీఆర్ పొగడటాన్ని కూడా పలువురు తప్పుపడుతున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ కు ఇందులో ఎలాంటి పాత్ర లేకపోతే వారిని ఇన్ని రోజుల పాటు స్వేచ్ఛగా ఎందుకు తిరగనివ్వడంలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సభ తర్వాత కూడా వారెక్కడున్నారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. - శ్యామ్ సుందర్ వరయోగి, సీనియర్ జర్నలిస్ట్