పదేండ్లలోనూ కృష్ణా ప్రాజెక్టులపై వివక్షే.. స్వరాష్ట్రంలోనూ దక్షిణ తెలంగాణపై నిరాదరణ

పదేండ్లలోనూ కృష్ణా  ప్రాజెక్టులపై వివక్షే.. స్వరాష్ట్రంలోనూ దక్షిణ తెలంగాణపై నిరాదరణ

 శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్ఎల్ బీసీ) టన్నెల్​లో జరిగిన  ప్రమాద ఘటనతో  దక్షిణ తెలంగాణలోని  సాగునీటి  ప్రాజెక్టుల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో నీటి వాటాలో ఎంత వివక్షకు గురైందో..  స్వరాష్ట్రంలో  పదేండ్లలోనూ  ఈ ప్రాంత ప్రాజెక్టులు అంతే  నిర్లక్ష్యమయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో  4 లక్షలకుపైగా  ఎకరాలకు  సాగునీటిని అందించే లక్ష్యంతో 2004లో  ఉమ్మడి రాష్ట్రంలో  సీఎం  వైఎస్ఆర్ ఎస్ఎల్ బీసీ  ప్రాజెక్ట్​ను  చేపట్టారు.  ఈ  ఏడాదితో  20 ఏండ్లు  దాటినా ప్రాజెక్ట్  ఇంకా అసంపూ ర్తిగానే ఉండిపోయింది.  ఇలా ఉమ్మడి రాష్ట్రంలో  పదేండ్లు, స్వరాష్ట్రంలో ఇంకో  పదేండ్లు ప్రాజెక్ట్​పై నిర్లక్ష్యమే  కొనసాగింది.

ప్రస్తుత  ప్రభుత్వం కొద్దిరోజుల కింద పనులు మళ్లీ  చేపట్టి  కొనసాగిస్తుండగా  భారీ ప్రమాదం జరిగింది.  దీంతో  ఘటనపై  అధికార,  ప్రధాన  ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద  దుమారమే  చెలరేగుతోంది. ఏది ఏమైనా  పదేండ్లలో  ‘తెలంగాణ కోటి ఎకరాల మాగాణం’  ఎంతవరకు  ఫలించిందో  తెలియదు.  కానీ,  దక్షిణ  తెలంగాణ మాత్రం నిరాదరణకు గురైంది.  

రెండు నదుల మధ్య సంగమ ప్రాంతం
రాష్ట్రంలో ఉత్తరాన గోదావరి నది పారుతుంటే.. దక్షిణాన కృష్ణానది పోతుంది. ఈ రెండు నదుల మధ్య సంగమ ప్రాంతమే తెలంగాణ. ప్రధానంగా పీఠభూమి ప్రాంతం. సముద్ర మట్టానికి 300 మీటర్ల నుంచి 650 మీటర్ల ఎత్తులో  ఉంటుంది. కాగా.. గోదావరి, కృష్ణా నదులు లోయల్లోంచి ప్రవహిస్తుండగా వీటి నుంచి నీటిని చాలావరకుఎత్తిపోతల ద్వారానే తెచ్చుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రంలోనే ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నా.. ఈ నదుల నీటిని తెలంగాణ అవసరాలు తీర్చుకోవడంలో ఉమ్మడి పాలనలో దశాబ్దాల పాటు వివక్షకు గురైనది చూశాం.  ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా   తొలి, మలి దశల్లో సాగు, తాగునీటి కోసమే  నడిచా యి.  తెలంగాణ వచ్చాకనైనా  సాగు, తాగునీళ్లలో  న్యాయం జరుగుతుం దని ఆశిస్తే.. ఉమ్మడి పాలనలో  మాదిరిగానే స్వరాష్ట్రంలో  కూడా దక్షిణ  తెలంగాణపై  వివక్షనే  చూపడం  విచారకరం. పదేండ్లలో  కృష్ణాజలాల్లోనూ ఏపీ దోపిడీ ఆగలేదు సరికదా  మరింతగా ఎక్కువైంది. దీనికి స్వరాష్ట్ర  తొలి పాలకుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. కృష్ణా నీటిని  సరిగా  వాడుకుని దక్షిణ తెలంగాణలో ప్రాజెక్ట్ లు సకాలంలో  పూర్తి  చేసుకోలేదు. 

ఉత్తర తెలంగాణకు వరప్రదాయనిగా నిర్మించినా..
ఉత్తర తెలంగాణ  వరప్రదాయనిగా  కాళేశ్వరం లిఫ్ట్  ఇరిగేషన్  పేరిట  భారీ ప్రాజెక్టును   సుమారు రూ. లక్ష కోట్లకుపైగా  ఖర్చుచేసి  ఐదేండ్లలోనే  గత  ప్రభుత్వం నిర్మించింది.  గోదావరి నుంచి సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే ప్రాజెక్ట్ లక్ష్యంగా ఉంది.  తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్టు కూడా ఇదే.  మేడిగడ్డ  బ్యారేజ్  పిల్లర్ల  కుంగుబాటుతో దాని భవిష్యత్  ప్రశ్నార్థకంగా  మారింది.  కాళేశ్వరంపై  చూపిన శ్రద్ధ.. దక్షిణ తెలంగాణలోని ఎస్ఎల్​బీసీ,  కల్వకుర్తి ఎత్తిపోతల, డిండి,  పాలమూరు– -రంగారెడ్డి వంటివి పూర్తి చేయడంపై చూపలేకపోయారు. ఇవి దశాబ్దాల కిందటే ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినా..నిర్లక్ష్యం కారణంగా నత్తనడకనే సాగాయి. 

దశాబ్ది పాలనలోనూ దక్షిణ తెలంగాణపై సాగు, తాగు నీటిపై నిర్లక్ష్యమే కొనసాగింది.  అంతేకాదు పక్కరాష్ట్రం  పోతిరెడ్డిపాడుకు పొక్కపెట్టి  మరింతగా  నీటిని తోడుకునేలా వ్యవహరించారు.  ఆ రాష్ట్రంలోని  సంగమేశ్వరం,  ముచ్చుమర్రి  ప్రాజెక్టులే ఇందు కు సాక్ష్యంగా చెప్పొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన దక్షిణ తెలంగాణ స్వరాష్ట్రంలోనూ నిరాదరణకే గురైంది. ఎమ్మార్ ప్రాజెక్ట్, ఎస్​ఎల్​బీసీ, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వమే సుమారు 70–80 శాతం పూర్తి చేసింది. పదేండ్ల పాలనలో మొక్కుబడి పనులు తప్ప మిగిలిన పనులను  పూర్తి చేయకుండా వదిలేసింది. 

పక్క రాష్ట్రం ప్రాజెక్టుల పేరిట నీళ్లు తోడుకుంటున్నా..
తెలంగాణకు ఉన్న కేటాయింపు నీళ్లను కూడా   వినియోగించుకునేలా ప్రాజెక్టులను పదేండ్లలో  నిర్మించలేకపోయారు.  ఏపీ కేటాయింపులను మించి  తోడుకుంటోంది. కొత్త  ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసుకుంటోంది.  తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలమూరు– -రంగారెడ్డి  ప్రాజెక్టుకు శంకుస్థాపన సందర్భంగా  ‘కుర్చీ వేసుకుని కట్టిస్తా.. నాలుగేండ్లలో నిర్మించి నీరందించి పాలమూరు పచ్చబడేలా చేస్తా’ అంటూ అప్పట్లో  కేసీఆర్​ చెప్పినా అతీగతీ లేకుండా పోయింది. ఫలితంగా హైదరాబాద్​ను మినహాయిస్తే దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో  కృష్ణా జలాలు అందక వ్యవసాయం వెనకబడిపోయింది.

కుర్చీ వేసుకుని పూర్తి చేస్తా నుంచి.. కుదరదు అనేదాకా..
‘తెలంగాణలో  వచ్చేది మన ప్రభుత్వమే. అవసరమైతే ఎస్ఎల్​బీసీ వద్ద కుర్చీ వేసుకుని పూర్తి చేయిస్తా.. ఎవరు అడ్డొచ్చినా.. ఎవరు అడ్డుపడినా ఆగదు’ అంటూ 2014లో  మహబూబ్ నగర్  ఎంపీగా ప్రచారంలో భాగంగా ఆనాడు  కేసీఆర్ మాట్లాడిన మాటలివి.  ‘ఎస్ఎల్​బీసీ ప్రాజెక్ట్ ఉమ్మడి పాలకుల కుట్ర.. అది అయ్యేది కాదు.. పోయేది కాదు. అదో పెద్ద  వృథా ప్రయాస ప్రాజెక్ట్’ అంటూ రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో కేసీఆర్​ వ్యాఖ్యానించారు. 

ఇలా ఎంపీ హోదాలో ఓ మాట.. సీఎం హోదాలో మరొక మాట మాట్లాడి మొత్తంగా ఎస్ ఎల్ బీసీపై క్షమించరాని  నిర్లక్ష్యం చేశారు.  మరోవైపు కుర్చీ వేసుకోకుండానే కాళేశ్వరం పూర్తి చేస్తే.. కుర్చీ వేసుకుని పూర్తి చేస్తా అన్న ప్రాజెక్ట్​లు  పడావు పెట్టారు.  ఇలా దక్షిణ తెలంగాణలోని నీటి ప్రాజెక్ట్ లపై క్షమార్హం కాని  వివక్ష చూపించారు. ప్రాజెక్టుల  సత్వర పూర్తికి  విచక్షణ  చూపకుండా వివక్ష చూపారనేది  అవగతమవుతోంది.  మొత్తంగా  దక్షిణ  తెలంగాణ  ఉమ్మడి రాష్ట్రంలోనూ అదే గోస.. స్వరాష్ట్రంలోనూ అదే గోస పడుతోంది. ఎల్ఎస్బీసీ టన్నెల్లో  దుర్ఘటనపై  నిందించాల్సింది ఎవరిని?  పదేండ్లలో  పనులను పడావు పెట్టిన గత ప్రభుత్వ దోషం కాదా?

వేల్పుల సురేష్, సీనియర్ జర్నలిస్ట్