స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో దేశానికి ప్రమాదం తప్పింది... నిరంజన్

స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో దేశానికి ప్రమాదం తప్పింది... నిరంజన్
  • బీజేపీపై పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కామెంట్

హైదరాబాద్, వెలుగు: బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో దేశానికి పెద్ద ప్రమాదం తప్పిందని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. బుధవారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో డెమోక్రసీని కాపాడేందుకు ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇచ్చారు. మోదీ, అమిత్ షాలు ఎన్నికల సమయంలో చేసిన విష ప్రచారాన్ని ఓటర్లు తిప్పికొట్టారు. ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీనిపై ఆయన పునరాలోచన చేయాలి.

ఎన్నికల ముందు మోదీ, అమిత్ షాలు.. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో చంద్రబాబు మాత్రం తమ ప్రభుత్వం ఏర్పడితే ముస్లింల రిజర్వేషన్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏలో చేరితే... ఆయన ఇచ్చిన మాటను ఏపీలో ఎలా నిలబెట్టుకుంటారు?’’అని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో మోదీ, అమిత్ షా నిర్ణయానికి కట్టుబడి ఉంటారా... లేక తన నిర్ణయాన్ని అమలు చేస్తారా.. అనే దానిపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ఎన్డీఏ కూటమిలో చేరికపై తమ నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.