బీఆర్ఎస్​ అంతం రేవంత్ ​వల్ల కాదు...మా పార్టీ మొక్కకాదు..మహా వృక్షం: పొన్నాల

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ను అంతం చేయడం సీఎం రేవంత్ రెడ్డి​వల్ల కాదని బీఆర్ఎస్​సీనియర్​నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బీఆర్ఎస్​మొక్క కాదని.. మహా వృక్షమని వెల్లడించారు. రేవంత్​లాంటోళ్లు ఎంతో మంది వస్తారు, పోతారుగానీ..బీఆర్ఎస్ మాత్రం అలాగే ఉంటుందని చెప్పారు. బుధవారం ఆయన తెలంగాణభవన్​లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ 11 నెలల పాలనలో అసలు ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారని పొన్నాల ప్రశ్నించారు.

సభల్లో సీఎం మాట్లాడే భాష ఇలాగే ఉంటుందా అని నిలదీశారు. తిట్లు తిట్టడమే సంబురాలా అని ప్రశ్నించారు. కేసీఆర్​ను అసెంబ్లీకి రావాలంటున్న ప్రభుత్వానికి.. అసలు సభలో బీఆర్ఎస్​ను ఎదుర్కొనే దమ్ముందా అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్​కు ఏ మాత్రం అవగాహన లేదని విమర్శించారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉన్నట్లు చాలా నివేదికలు చెప్పాయన్నారు. 

తెలంగాణ పాలిట శాపం రేవంత్: దాసోజు 

తెలంగాణ పాలిట రేవంత్​శాపంగా మారారని దాసోజు శ్రవణ్​మండిపడ్డారు. రాజకీయాలను చిల్లరమల్లరగా మార్చేశారన్నారు. పిచ్చిపట్టిన వాళ్లలాగా రేవంత్​మాట్లాడుతున్నారని, మంత్రివర్గంలోని ఉత్తమ్​, శ్రీధర్​ బాబు, దామోదర రాజనర్సింహ లాంటి మేధావులు ఆయన  భాషను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్​ ఉద్యమ వటవృక్షమైతే.. తులసీ వనంలో గంజాయి మొక్కలా రేవంత్​మారారని విమర్శించారు. రేవంత్​ ఫ్రస్ట్రేషన్​ స్టార్, పరేషాన్​ రెడ్డిలా మారారని దాసోజు ఎద్దేవా చేశారు.