- కేటీఆర్, హరీశ్మాట్లాడుతున్నా కారు దిగుతున్న నేతలు
- కాంగ్రెస్‌లోకి మోత్కుపల్లి, వేనేపల్లి, విద్యాసాగర్
- లోకల్ లీడర్ల వలసలూ ఆగట్లే..
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి వలసలను అడ్డుకునేందుకు ఆ పార్టీ హైకమాండ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి, జానారెడ్డి.. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడంతో పలువురు బీఆర్ఎస్ లీడర్లు కారు దిగి, కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. దీంతో గులాబీ పెద్దలకు నిద్ర పట్టడం లేదు. తాజాగా కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, ఆలేరులో మోత్కుపల్లి నర్సింహులు , నకిరేకల్‌లో మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ లాంటి పెద్ద లీడర్లు బీఆర్ఎస్ను వీడడంతో ఆ పార్టీలో ఆందోళన నెలకొంది. వలసలను అడ్డుకునేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు చేస్తున్న ప్రయత్నాలు వర్క్‌వుట్ కావట్లేదు. సీనియర్ లీడర్లే కాకుండా ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు కూడా బుజ్జగింపులను పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేలు తమను ఆర్థికంగా, మానసికంగా, రాజకీయంగా అణగదొక్కారని, మళ్లీ గెలిస్తే తమను రాజకీయంగా సమాధి చేస్తారన్న భయంతోనే కారు దిగుతున్నట్లు చర్చ జరుగుతోంది. నకిరేకల్, కోదాడ, నల్గొండ, ఆలేరు, నాగార్జున
సాగర్, హుజూర్నగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్లో
అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి.
కేటీఆర్, హరీశ్ చెప్పినా ఆగట్లే..
పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్, హరీశ్ రావు నచ్చచెప్పినా అసంతృప్తులు వినట్లేదు. ఈ క్రమంలో హైకమాండ్ ఇచ్చే హామీలతోనూ మెత్తబడడం లేదు. గతంలో ఇలాగే హామీలు ఇచ్చి నిండా ముంచారని నేతలు చెప్తున్నారు. దళితుబంధు చైర్మన్ వస్తదన్న ఆశతో ఇన్నాళ్లు ఓపికపట్టిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును సీఎం కేసీఆర్ పట్టించుకోలేదన్న వాదన ఉంది. కొంతకాలంగా మౌనంగా ఉన్న ఆయన శుక్రవారం ఢిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్కండువా కప్పుకున్నారు. ఆలేరులో ఐదుసార్లు,
తుంగతుర్తిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి తుంగతుర్తి టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ తర్వాత అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో నేతి విద్యాసాగర్ దూరమయ్యారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఆయనను కేటీఆర్ వద్దకు తీసుకెళ్లినా లాభం లేకుండాపోయింది. కోదాడలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మీద అసంతృప్తితో ఉన్నారు. కోదాడ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2014లో బీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి ఏదో ఓ పదవి వస్తదని ఆశించినా హైకమాండ్ గుర్తించకపోవడంతో పార్టీ వీడారు.
గుత్తాకు నిరాశే..
తన కొడుకు అమిత్‌కు అవకాశం రాకపోవడంతో సీనియర్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారు. సిట్టింగ్‌లను మారిస్తే అమిత్‌కు అవకాశం ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈసారి కూడా సిట్టింగ్‌లకే ఛాన్స్ ఇవ్వడంతో అమిత్‌కు టికెట్ దక్కలేదు. అమిత్‌కు ఎంపీ టికెట్ ఇస్తామని హైకమాండ్ చెప్పినట్టు తెలుస్తోంది. కానీ, ఎంపీ ఎన్నికల నాటికి అధిష్ఠానం మాటమారిస్తే నష్టపోతామని భావించిన గుత్తా.. లోక్‌సభ ఎన్నికల్లో తాను లేదా తన కొడుకు పోటీ చేస్తామని ముందుగానే ప్రకటించేయడం బీఆర్ఎస్ లీడర్ల తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.
లోకల్ లీడర్ల క్యూ...
సీనియర్లు, లోకల్ లీడర్లు కూడా కాంగ్రెస్ వలసబాట పడ్తున్నారు. ఎమ్మెల్యేల వైఖరి నచ్చక ఇప్పటికే నల్గొండ, కోదాడ, హుజూర్నగర్ లీడర్లు పార్టీ వీడారు. శుక్రవారం నకిరేకల్ నియోజకవర్గంలోని కట్టంగూరు, నకిరేకల్ ఎంపీపీ, జడ్పీటీసీలు ఢిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం భువనగిరి, దేవరకొండ, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన మూడుచోట్ల కూడా క్యాండిడేట్లను ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ నుంచి మరింత మంది, లోకల్‌బాడీలకు చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లోకి వలస వెళ్లే అవకాశం ఉంది. దీంతో దేవరకొండ, మునుగోడు నుంచి అసంతృప్తులు పార్టీ మారకుండా జిల్లా నాయకత్వం ప్రయత్నిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో చాలామంది నాయకులు పార్టీ మారనున్నట్టు తెలిసింది.