- బాన్సువాడ బరిలో ఏనుగు రవీందర్ రెడ్డి?
- ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్‌లో చేరికలు
- ఉమ్మడి జిల్లాలో రసవత్తరంగా రాజకీయం
కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు మండవ వెంకటేశ్వరరావు, ఏనుగు రవీందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఏనుగు రవీందర్‌రెడ్డిని బాన్సువాడ నుంచి, మండవ వెంకటేశ్వరరావును నిజామాబాద్ రూరల్ నుంచి బరిలో నిలుపుతారని ప్రచారం జరుగుతోంది. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు వీరితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో మండవ వెంకటేశ్వరరావు ఇంటికి రేవంత్‌రెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి తదితరులు వెళ్లారు. వీరితో పాటు ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరిని పార్టీలోకి రావాలని కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారు. వీరు పార్టీలో ఎప్పుడు చేరుతారన్నది ఒకటి, రెండు రోజుల్లో తేలనుంది.
బాన్సువాడ బరిలో రవీందర్!
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి బీజేపీ సీనియర్ నేతగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన జాజాల సురేందర్ బీఆర్ఎస్లో చేరడంతో ఏనుగు రవీందర్‌రెడ్డికి పార్టీలో ప్రయార్టీ తగ్గింది. ఈటల రాజేందర్‌తో కలిసి ఏనుగు రవీందర్‌రెడ్డి బీజేపీలో చేరారు. హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో యాక్టివ్‌గా పని చేశారు. ఆ తర్వాత ఈటెలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఏనుగు బీజేపీ కార్యక్రమాలతో పాటు, ఈటలకు దూరంగా ఉంటున్నారు. రెండు నెలలుగా ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఎల్లారెడ్డి టికెట్ కోసం ఆయన అప్లయ్ కూడా చేయలేదు.
పది రోజుల కింద మళ్లీ బీజేపీలోనే కొనసాగుతారని, ఎన్నికల బరిలో నిలుస్తారని ఆయన అనుచరులు పేర్కొన్నారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఎల్లారెడ్డి టికెట్ఆశిస్తున్నప్పటికీ, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడి నుంచి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఏనుగు రవీందర్‌రెడ్డిని బరిలో నిలిపే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరేది, ఎక్కడి నుంచి పోటీలో ఉంటారనేది ఒకటి, రెండు రోజుల్లో తేలనుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
సెటిలర్లు ఎక్కువగా ఉన్న రూరల్ నుంచి మండవ
ఉమ్మడి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత అయిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పట్లో సీఎం కేసీఆర్స్వయంగా మండవ ఇంటికి వెళ్లి పార్టీలో చేర్చుకున్నారు. ఏదైనా కీలక పదవి దక్కుతుందని ఆయన అనుచరులు భావించారు. నిజామాబాద్ ఎంపీగా కవిత ఓటమి, అనంతరం మండవ కూడా సైలెంట్ అయ్యారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో మండవను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు భావించారు. కొద్దిరోజుల కింద ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.
తుమ్మలకు మండవకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తుమ్మల ద్వారా మండవను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మండవ రాకతో ఆ ఓట్లు తమకు పడతాయని హస్తం నేతలు భావిస్తున్నారు. నిజామాబాద్ రూరల్‌లో సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఇక్కడి నుంచి మండవను పోటీ చేయిస్తారని చర్చ నడుస్తోంది. ఇక్కడి నుంచి ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీలు ఆర్.భూపతిరెడ్డి, అరికెల నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేశ్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.