యువకుడిపై పోలీసుల దాడి.. ఉన్నతాధికారుల ఆరా

హైదరాబాద్ పాతబస్తీ మొఘల్ పురాలో ఓ యువకుడిని పోలీసులు చితకబాదిన సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. తనను అకారణంగా పోలీసులు కొట్టారని బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ ఫుటేజీని కూడా అందించడంతో ఈ సంఘటనను అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. 

బాధితుడు మహమ్మద్ ఇబ్రహీం తెలిపిన వివరాల ప్రకారం..  షాప్ మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో మొఘల్‌పురా కమాన్‌ దగ్గర స్థానిక పోలీసులు.. తమ తమ్ముడిని ఆపారని మహమ్మద్ ఇబ్రహీం చెప్పాడు. ఎందుకు ఆపుతున్నారు..? ఇంటికి వెళ్తున్నమని చెప్పడంతో తనను పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టారని మహమ్మద్ ఇబ్రహీం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కాళ్లు, చేతులపై విచక్షణ రహితంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొఘల్ పురా పోలీసులు తనను ఎలా కొట్టారో సీసీటీవీ ఫుటేజీని పోలీసు ఉన్నతాధికారులకు అందించాడు. దక్షిణ మండలం డీసీపీ సాయిచైతన్య ఈ ఘటనపై మొఘల్ పురా పోలీసులను వివరణ కోరారు.