కరీంనగర్, వెలుగు: ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ రాజకీయ నాయకుడు కొత్త జైపాల్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరపగా కరీంనగర్ టికెట్ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్లో చేరబోతున్నట్లు జైపాల్ రెడ్డి బుధవారం వెల్లడించారు.
వాస్తవానికి జైపాల్ రెడ్డితో ఈ నెల 12న మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ చర్చలు జరిపి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆయనకు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఆఫర్ చేసినట్లు తెలిసింది. అయితే జైపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం తమకు ఏ మాత్రం ఇష్టం లేదని, ఆయన చేరితే తాము బయటికి వెళ్తామని చొప్పదండి నియోజకవర్గానికి చెందిన కొందరు బీఆర్ఎస్ లీడర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం పునరాలోచనలో పడడంతో కొత్త జైపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది.