కాంగ్రెస్ పార్టీకి గొప్ప చరిత్ర ఉంది. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి ఒరిజనల్ నాయకులు వల్లనే కాంగ్రెస్‌కు గొప్పతనం వచ్చింది. వారి జ్ఞాపకాలను గౌరవించడం కాంగ్రెస్ సంప్రదాయాల్లో ఒకటి. ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ మనుగడపై ఆందోళన కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన సీనియర్లను మర్చిపోతోంది. గొప్ప జాతీయవాద శక్తులైన తమ సీనియర్ నాయకులను గౌరవించడం కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం చాలా అవసరం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దివంగత అహ్మద్ పటేల్ పిల్లలు పార్టీ టికెట్ కోసం ఢిల్లీలో తిరగడం గతవారం దేశం మొత్తం చూసింది. 1980 నుంచి 1998 వరకూ అహ్మద్ పటేల్ ఎంపీగా ఉన్నా వారిని కాంగ్రెస్ నేతలెవరూ కలవలేదు. అనంతరం సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 2014 వరకూ అహ్మద్ పటేల్ సర్వ శక్తిమంతుడిగా పార్టీలో వ్యవహరించారు. 2020లో అహ్మద్ పటేల్ తుదిశ్వాస విడిచారు. ఆయన చనిపోకముందు రాహుల్ గాంధీతో కొన్ని విభేదాలు నెలకొన్నాయి. రాహుల్ గాంధీతో విభేదాల వల్ల సమర్థుడైన సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ సేవలను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది. మధ్యప్రదేశ్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ ఇందిరాగాంధీ కుమారులకు అత్యంత సన్నిహితుడు. ఆయన 1980లో ఎంపీ అయ్యాడు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పదవులను నిర్వహించాడు. ఇప్పుడు ఆయన కుమారుడు నకుల్ నాథ్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాడు. కమల్ నాథ్ ఇటీవల దాదాపు పార్టీని వీడినంత పనిచేశారు. పార్టీ తనను అవమానించిందని, విస్మరించిందని ఆయన చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్‌లో 2022 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే గత వారం రాజ్యసభ ఎన్నికల్లో 68 ఎమ్మెల్యేల్లో 43 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటమి ఎదురైంది. దాదాపు ప్రభుత్వం పడిపోయే పతనావస్థకు చేరుకుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి సుక్కు ప్రభుత్వం అస్థిరత స్థితిలో కొనసాగుతోంది. ఆరుసార్లు సీఎం పదవిని అధిష్ఠించిన మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుటుంబం సుక్కు నాయకత్వంపై అసంతృప్తిని వెల్లడించింది. వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా వీరభద్రసింగ్ మాట్లాడుతూ-.. ముఖ్యమంత్రి సుక్కు అని తమను, ఎమ్మెల్యేలను అవమానించారని తమ మాట వినేవారు ఢిల్లీ హైకమాండ్‌లో ఎవరూ లేరని ఆరోపించారు. ఈ మూడు సంఘటనలు కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు ఇక తమకు చోటు లేదని, తమ మాట వినేందుకు ఎవరూ లేరని గుర్తించారు. గాంధీభవన్ దగ్గరకు వెళితే మనకు ఈ విషయం బోధపడుతుంది. సీనియర్ కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు వచ్చింది. గ్రీక్ తత్వవేత్త హెరాక్లిటస్ 2,500 సంవత్సరాల క్రితం చెప్పినట్లుగా ‘మార్పు మాత్రమే స్థిరమైనది’.
కాంగ్రెస్శ్రేణుల సొంతిల్లు గాంధీభవన్
గాంధీభవన్‌లంటే ప్రతి కాంగ్రెస్ వ్యక్తి చేసే హడావుడికి చిరునామా. కాంగ్రెస్ శ్రేణులు దానిని తమ సొంత ఇల్లులా భావించి దూసుకుపోతారు. కాంగ్రెస్ కార్యకర్తలు తాము మహాత్మా గాంధీ వంటి నాయకుల పార్టీకి చెందినవారమని గొప్పలు చెప్పుకుంటారు. కాంగ్రెస్‌కు అక్షరాల 150 సంవత్సరాల గత చరిత్ర ఉంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా 20 కోట్ల ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడున్న వింత కథ ఏంటంటే.. సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రెస్ హైకమాండ్‌ను గానీ లేదా గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు అపాయింట్‌మెంట్ పొందలేకపోతున్నారు. కేవలం కొద్దిమంది విశేషాధికారం లేదా ప్రత్యేక సౌలభ్యం ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రమే హైకమాండ్, గాంధీలను నేరుగా కలుసుకోగలుగుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను పరిశీలిస్తే.. వందల మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఇలాంటి సీనియర్ నేతలను కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకోవాలి. అనేక విజయవంతమైన దేశాలు తమ పూర్వీకులను, వృద్ధులను గౌరవిస్తాయి. ఇండోనేషియా ఇప్పుడు 90% మంది ముస్లింలు ఉన్న దేశం. ఒకప్పుడు హిందూమతం ఇండోనేషియాలో ఆధిపత్యం చెలాయించింది. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఒక పాకిస్తానీ మంత్రి ఇండోనేషియాను సందర్శించినప్పుడు ఆయన ఇండోనేషియా నాయకులను ఇలా అడిగారు. ‘మీది ముస్లిం దేశం. అయితే, మీరు ప్రతిచోట ఇంకా పాత హిందూ పేర్లునే ఎందుకు ఉపయోగిస్తున్నారు’ అని అడిగారు. దానికి ఓ ఇండోనేషియా నాయకుడు ఈవిధంగా బదులిచ్చాడు. ‘మేము మతాన్ని మార్చుకున్నాం. కానీ, మేము మా పూర్వీకులను మార్చుకోలేదు’ అన్నారు. ఇదీ ఇండోనేషియా వారి చరిత్రకు ఇచ్చిన గౌరవం. మరో మంచి ఉదాహరణ చైనీయులు. ఒక చైనా అధ్యక్షుడు తన గత నేతలను గౌరవిస్తాడు. చైనా సీనియర్ నాయకులు ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఉండే కాంపౌండ్లోనే వారు కూడా నివసిస్తారు. వారు జీవించి ఉన్నంతవరకు అన్ని ముఖ్యమైన సమావేశాలలో అధ్యక్షుడితోపాటు పాల్గొంటారు.
కాంగ్రెస్ గొప్ప శక్తిగా ఎదగాలి
కాంగ్రెస్ పార్టీ తనను తాను పునరుద్ధరించుకుని గొప్ప శక్తిగా ఎదగాలి. సీనియర్ నాయకులను ఆ పార్టీ స్వాగతించి గౌరవించాలి. వారి మేధస్సు, అనుభవాన్ని పార్టీ అభ్యున్నతికి వినియోగించుకోవాలి. సీనియర్ నాయకులు తమ జ్ఞానం, అపార అనుభవంతో మార్గనిర్దేశం చేయవచ్చు. అన్ని రాష్ట్రాల్లోనూ సహజంగానే కాంగ్రెస్ నాయకుల గ్రూపులు, వివాదాలు ఉన్నాయి. కానీ, సీనియర్లు ప్రతి వర్గానికి కీలక స్థానం ఉండేలా చూసుకున్నారు. అయితే, ప్రస్తుత నాయకత్వంలో కొందరు సీనియర్లు అవినీతిపరులుగా అపకీర్తిని మూటగట్టుకున్నారు. అప్రతిష్ట, అవినీతి ఆరోపణలు ఉన్నా కొంతమంది నాయకులు రాజ్యసభ ఎంపీలు లేదా మంత్రులు అయ్యారు. అటువంటివారు వారి పదవిని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అలాంటి అవినీతి మరకలు ఉన్న నాయకులను విస్మరించాలి. కానీ 90% సీనియర్ నాయకులు నిజాయితీగా ఉన్నారు. వారిని ఆదరించి గౌరవించాలి. నేడు కాంగ్రెస్‌లో నెలకొన్న ప్రధాన సమస్యలకు “నాయకత్వ శూన్యత లేదా లోటు” కారణం. సీనియర్లను తిరిగి కాంగ్రెస్ హైకమాండ్ ఆదరించి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
సీనియర్స్‌ను మరచిపోయారా లేదా తిరస్కరించారా?
కాంగ్రెస్ హైకమాండ్‌ను పరిశీలిస్తే గాంధీలు, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్. జైరాం రమేష్, మరో ఇద్దరు నాయకులు మాత్రమే ప్రధానంగా ఉన్నారు. ఇది నాయకుల మధ్య రాజకీయ శూన్యతను సృష్టించింది. తమ సమస్యలను పరిష్కరించేవారు లేకపోవడంతో ఆయా రాష్ట్రాల్లో కొంతమంది సీనియర్ నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారు. అహ్మద్ పటేల్‌కు ఉన్న బలహీనత గురించి చెప్పాలంటే ఆయన పెద్ద నాయకులను, ధనిక నాయకులను మాత్రమే కలుసుకునేవారు. కానీ, ఒకసారి ఆయన మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండేవారు. 1998 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి రాజ్యసభ ఎంపీ కెరీర్‌పరంగా ఆయనకు రుణపడి ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో డజన్ల కొద్దీ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు వారిని కలుసుకుని తమ అభిప్రాయాలను తెలిపేవారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి కార్యకర్త తాను కాంగ్రెస్‌లో భాగమని భావించేవారు. కాంగ్రెస్ పార్టీలో కనీసం వెయ్యి మంది మాజీ కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు తదితరులు నాయకులుగా ఉన్నారు. ఈ నేతల సామూహిక జ్ఞానం అపారమైనది. భారతదేశంలోని ప్రతి పట్టణంలో కాంగ్రెస్ కార్యాలయం ఉంది.
- డా.పెంటపాటి పుల్లారావు,పొలిటికల్ ఎనలిస్ట్