ఉద్యోగిని మందలించడం క్రిమినల్ నేరం కాదు..సుప్రీంకోర్టు తీర్పు

ఉద్యోగిని మందలించడం క్రిమినల్ నేరం కాదు..సుప్రీంకోర్టు తీర్పు

న్యూఢిల్లీ: ఆఫీస్ లో ఉద్యోగిని మందలించడం క్రిమినల్ చర్యలు తీసుకునే ‘‘ఉద్దేశపూర్వక అవమానం” కాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి కేసుల్లో వ్యక్తులపై క్రిమినల్ అభియోగాలు మోపడానికి పర్మిషన్ ఇస్తే దురదృష్టకర పరిణామాలకు దారితీయొచ్చని, ఆఫీసులో డిసిప్లిన్ ను దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఉద్యోగి పెట్టిన కేసును కొట్టేయాలంటూ తీర్పునిచ్చింది.

సాటి ఉద్యోగుల ముందు ఇష్టారీతిన తిట్టి తనను అవమానించాడంటూ ఒక మహిళా అసిస్టెంట్​ప్రొఫెసర్ 2022లో పెట్టిన క్రిమినల్ కేసు కొట్టేయాలంటూ హైదరాబాద్ లోని నేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్(నిపిడ్) డైరెక్టర్ దాఖలు చేసిన పిటిషన్​ను ఫిబ్రవరి 10న జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది.

కరోనా విపత్కర సమయంలో అంటు వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌లో తగినన్ని పీపీఈ కిట్లు అందించడంలో, కరోనా పరిస్థితులను మేనేజ్​చేయడంలో డైరెక్టర్ విఫలమయ్యారని ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు ఆ తర్వాత వివిధ విభాగాల ఇన్​చార్జ్​లు, ఉద్యోగులతో జరిగిన మీటింగ్​లో డైరెక్టర్ తనను ఇష్టారీతిన తిట్టి, వార్నింగ్​ఇచ్చారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చార్జిషీట్, దాని అనుబంధ పత్రాలను పరిశీలించిన తర్వాత ఆరోపణలు ఊహాజనితంగా కనిపిస్తున్నాయని విచారణ సందర్భంగా న్యాయమూర్తులు అన్నారు. ఈ హెచ్చరికను డిసిప్లిన్, ఉద్యోగుల విధినిర్వహణను మేనేజ్​చేసే అంశంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు పేర్కొని డైరెక్టర్​పై పెట్టిన క్రిమినల్ కేసులను కొట్టేయాలంటూ తీర్పు వెల్లడించారు.