- ఆయనకు టికెట్ ఇస్తే పనిచేయమంటు హెచ్చరికలు
- అయోమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా కాంగ్రెస్ లో పంచాయితీ నడుస్తోంది. డీసీసీ లకు కొత్త అధ్యక్షుల ఎంపిక విషయంలో తలెత్తిన విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్లంతా మాజీ మంత్రి చిన్నారెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఆయన ఒంటెత్తు పోకడలు పార్టీకి నష్టం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్న వారికే మళ్లీ పదవులు కట్టబెట్టి సీనియర్లను అవమానించారని మండిపడుతున్నారు. మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాము పనిచేయమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వద్ద ఇటీవల మొర పెట్టుకున్నారు. తాజాగా చిన్నారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన సమావేశంలో పార్టీ నాయకుల మధ్య విభేదాలు వద్దని అవసరం అయితే కాళ్లు పట్టుకుంటానని వేడుకోవాల్సి వచ్చింది. వనపర్తి నియోజక వర్గం మొదటి నుంచీ కాంగ్రెస్ కు కంచుకోట. ఇక్కడి నుంచి చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో ఆయన మంత్రి పదవి కూడా నిర్వహించారు. మొదటి నుంచి చిన్నారెడ్డి పార్టీ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారంటూ ఆయన పట్ల నియోజకవర్గంలో అసంతృప్తి వ్యక్తం అవుతూనే ఉంది. తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగిన సమయంలోనూ 2014 లో ఇక్కడి కార్యకర్తలు ప్రజలు చిన్నారెడ్డి నే ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. దీనిని అలుసుగా భావిస్తు వచ్చిన ఆయన 2018 లో జరిగిన ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకుల ఆగ్రహానికి గురై టీఆర్ఎస్ చేతిలో ఘోర పరాభవం చవిచూశారు. టీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి చేతిలో 50వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఇక రాజకీయాల్లో తాను ఉండలేనని, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేనని అసహనం వ్యక్తం చేశారు.ఈ తరుణంలో పార్టీ లోని సీనియర్లు తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలంటూ పార్టీ అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నారు. లేని పక్షంలో చిన్నారెడ్డిని తప్పించి నియోజకవర్గంలో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో గత కొద్ది కాలంగా మాజీ మంత్రి చిన్నారెడ్డికి సీనియర్ కార్యకర్తల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.
డీసీసీ ఎంపికతో బయటపడ్డ విభేదాలు...
వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎన్నికల్లో కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా చిన్నారెడ్డి వ్యవహరించారని జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి కాకుండా బీసీసెల్ రాష్ట్ర కమిటీలో పదవి ఉన్న రాజేంద్రప్రసాద్ ను నియమించి పార్టీ నిబంధనలను ఆయన ఉల్లంఘించారని మాజీ అధ్యక్షులు శంకర్ ప్రసాద్ తో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు కు చెందిన సీనియర్ నాయకులు అక్కి శ్రీనివాస్ గౌడ్ చిన్నారెడ్డి తీరు ను తప్పు పట్టారు.ఇప్పటికే పార్టీలో ఉన్న సీనియర్లంతా ఇతర పార్టీలోకి వెళ్లినా చిన్నారెడ్డి తీరు మారడం లేదని విమర్శిస్తున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బి లక్ష్మయ్య, వైస్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి మరో పార్టీలో చేరారు.అదేవిధంగా పెద్దమందడి కి చెందిన జగదీశ్వర్ రెడ్డి, వనపర్తి మండలానికి చెందిన కురుమూర్తి యాదవ్, పెబ్బేరుకు చెందిన గౌని బుచ్చారెడ్డి, ఘనపురానికి చెందిన లక్ష్మారెడ్డి లాంటి సీనియర్లు అంతా చిన్నారెడ్డి వేధింపులు తాళలేకే నే పార్టీ వీడి మరో పార్టీ లో చేరి జిల్లాస్థాయి పదవులను పొందారని గుర్తుచేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చేందుకే చిన్నారెడ్డి ముందుకు రావడం లేదని మండిపడుతున్నారు. ఇటీవల కార్యకర్తల సమావేశంలోనూ తనకు పా సీనియర్లతో పనేం లేదని అనడంపై కూడా ఫిర్యాదులు వెళ్లాయి. మరో పక్క వనపర్తిలో కాంగ్రెస్ టికెట్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ పెద్దమందడి మండలం చిలుకటోని పల్లికి చెందిన సర్వేశ్వర్ రెడ్డి కే టికెట్ వస్తుందంటూ అనుచురులు ప్రచారం చేస్తున్నారు.
కొల్లాపూర్, దేవరకద్ర నియోజకవర్గాల్లోనూ ..
జిల్లాలోని కొల్లాపూర్ , దేవరకద్ర నియోజకవర్గాల్లోనూ అసమ్మతి నెలకొంది. దేవరకద్ర నియోజకవర్గంలోనూ పార్టీ టికెట్టుకోసం ముగ్గురు నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జీ మధుసూదన్ రెడ్డి, బీసీ నేతగా ప్రచారం చేసుకుంటున్న ప్రదీప్ కుమార్ గౌడ్ తో పాటు కొండా ప్రశాంత్ రెడ్డి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. వీరి అనుచరులు పరస్పరం విమర్శలకు వీరి అనుచరులు దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కి ఐక్యత కరువైంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆ పార్టీ లో ఇద్దరు నేతలు ఎమ్మెల్యే టికెట్ కోసం కార్యకర్తల్లో అయోమయానికి తెరలేపారు. సీనియర్ నాయకులు జగదీశ్వర్ రావు , యువనాయకుడు అభిలాష్ రావు ఎవరికి వారు నియోజకవర్గంలో పాదయాత్రలు చేస్తూ పార్టీ ని రెండు గా చీల్చారు. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో మంచి పట్టుఉన్నప్పటికి గ్రూప్ రాజకీయాలు, వర్గపోరుతో పార్టీలోని నేతలంతా ఇతర పార్టీ ల వైపుపు చూస్తున్నారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విబేధాల పట్ల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పూర్తి సమాచారం సేకరిస్తున్నారని ఇక్కడ గెలిచేవారికే టికెట్లు వస్తాయంటూ వనపర్తి లోని రేవంత్ క్లాస్ మేట్లు, సన్నిహితులు కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను సర్ధిచెప్పుతున్నారు. పార్టీ తీరు మార్చకుంటే మరోసారి ఘోర పరాభవం తప్పదని కార్యకర్తలు, నాయకులు హెచ్చరిస్తున్నారు.