- పొన్నాల, సంభాని, నాగం పరిస్థితి అగమ్యగోచరం
- మళ్లీ సొంతగూటికి వచ్చే యోచనలో పలువురు లీడర్లు
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో పదేండ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ లీడర్లతో పాటు క్యాడర్ ఫుల్‌జోష్‌లో ఉంది. అయితే, కొందరు మాత్రం తమ పరిస్థితిని తల్చుకుని తల్లడిల్లుతున్నారు. వేర్వేరు కారణాలతో ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్‌నుంచి బీఆర్ఎస్లో చేరిన లీడర్ల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఆశించిన టికెట్ దక్కకపోవడం, ముఖ్య నేతలతో విభేదాలు, ఇలా పలు రకాల కారణాలతో మాజీ పీసీసీ చీఫ్ దగ్గర నుంచి మొదలుకుంటే కొద్దిమంది మాజీ మంత్రులు పార్టీ మారిన వారిలో ఉన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్న అంచనాలతో ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు తలకిందులైంది. ఏఐసీసీ లీడర్ల దగ్గరి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు బుజ్జగించే ప్రయత్నాలు చేసినా, కచ్చితంగా ఈసారి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినా పట్టించుకోలేదు. తీరా కాంగ్రెస్ పవర్లోకి రావడంతో వారు ఇప్పుడు బాధపడుతున్నారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చే సమయానికి తాము ఎటూ కాకుండా పోయామన్న బాధలో ఉన్న ఆ నేతల్లో పలువురు ఇప్పుడు మళ్లీ పాత గూటికి వచ్చే ఆలోచనలో ఉన్నారు.
టికెట్లు రాలేదని..
ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌గా పనిచేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌కు కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధముంది. ఇద్దరూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రులుగా పనిచేశారు. జనగామ టికెట్ దక్కకపోవడంతో పొన్నాల లక్ష్మయ్య, సత్తుపల్లి టికెట్ రాకపోవడంతో సంభాని చంద్రశేఖర్ బీఆర్ఎస్లో చేరారు. అక్టోబర్‌లో పొన్నాల పార్టీ మారగా, నవంబర్‌లో సంభాని బీఆర్ఎస్లో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మరో సీనియర్‌నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన నాగం, తర్వాత పరిణామాలతో బీజేపీలో చేరారు. మొదటి నుంచి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసిన నాగం, బీజేపీ నుంచి నాలుగేండ్ల కింద కాంగ్రెస్ గూటికి చేరారు. ఆశించిన నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, ఊకే అబ్బయ్య, ఎర్ర శేఖర్, కాంగ్రెస్ లీడర్లు మానవతారాయ్ తదితరులు ఎలక్షన్లకు కొద్దిరోజుల ముందే కాంగ్రెస్ ను వీడారు. వీళ్లలో కొద్ది మంది మళ్లీ సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. భావోద్వేగ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడి తప్పు చేశామని కార్యకర్తలు, సన్నిహితులతో కామెంట్ చేస్తున్నట్టు సమాచారం. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ రేవంత్ సహా సీనియర్లు బుజ్జగించినా వినకుండా, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఒకరిద్దరు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. మరీ తొందరపడినట్టు కాకుండా కొద్దిరోజుల తర్వాత కాంగ్రెస్ లో చేరాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, కార్యకర్తలు మాత్రం ఎలక్షన్ల ముందు కాంగ్రెస్‌ను వీడి తప్పుచేశారంటూ ఆయా నేతలతో కామెంట్ చేస్తున్నట్టు సమాచారం.