- డస్ట్‌బిన్ నిండగానే ఆటోమేటిక్ గా కంట్రోల్ రూమ్‌కు సమాచారం
- మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో చెత్త సమస్యకు సెన్సార్ కంటైనర్లతో (డస్ట్ బిన్) చెక్ పెట్టనున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. షేక్ పేట్ డివిజన్లోని పలు కాలనీల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, ఫరాజుద్దీన్తో కలిసి పర్యటించారు. రోడ్లపై చెత్త వేసే ప్రదేశాలను గుర్తించి అక్కడ చెత్త వేయకుండా సెన్సార్ కంటైనర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
కంటైనర్ నిండగానే ఆటోమేటిక్ గా కంట్రోల్ రూమ్‌కు సమాచారం వస్తుందని, దీంతో జీహెచ్ఎంసీ వాహనం అక్కడి చేరుకొని చెత్తను తీసుకెళ్తుందన్నారు. అదేవిధంగా రోడ్లపై వేసిన చెత్తను యంత్రాల ద్వారా తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో కొత్త తీసుకొచ్చిన ‘జటాయు’ యంత్రం పనితీరును పరిశీలించారు. అంతకుముందు సింగిడికుంటలో 2.5 కిలోమీటర్ల నాలాపై సుమారు రూ.30 కోట్లతో చేపట్టిన బాక్స్ డ్రెయిన్ పనులను మేయర్ పరిశీలించారు. డ్రెయిన్ నాలా పనులతో పాటుగా తాగు నీటి పైప్ లైన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ కమిషనర్లు శివ కుమార్ నాయుడు, రఘుప్రసాద్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఎస్ఎన్డీపీ సీఈ కోటేశ్వర రావు పాల్గొన్నారు.