హైదరాబాద్: మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో 300 మందికి పైగా భక్తులు చనిపోతే.. కేవలం 30 మందే చనిపోయారని యూపీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట, మరణాలపై నిజానిజాలు బయట పెట్టేందుకు సుప్రీంకోర్టులో పిల్ వేస్తున్నానని తెలిపారు.
ఆధ్యాత్మిక వేడుకల్లో వరుస విషాదాలు చోసుకుంటున్న నేపథ్యంలో కుంభమేళానే కాకుండా టీటీడీ లాంటి దేవాలయాల్లో సైతం వీఐపీ ఎంట్రన్స్‌లను వెంటనే రద్దు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. పుష్ఫ సినిమా విడుదల సందర్భంగా తొక్కిసలాట జరిగితే 100 కోట్ల రూపాయలు ఇచ్చేంతవరకు వదలలేదు.. ఇక్కడ పదుల సంఖ్యలో ప్రాణాలు పోయిన కేసులు లేవని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి అంటే ప్రధాన సేవకుడు.. అలాంటి సీఎం ప్రజలకు సేవ చేస్తాడా ప్రాణాలు తీస్తాడా అని ప్రశ్నించారు.
Also Read :- హైదరాబాద్ బాలానగర్‌లో పేలుడు కలకలం
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు ప్రధాని మోడీకి తొత్తులుగా మారిపోయారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 38 వేల గ్రామాల్లో ఒక్కో గ్రామానికి కోటి రూపాయలు ఈ బడ్జెట్లో కేంద్రం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేఏ పాల్. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కనీసం రూ.55 వేల కోట్ల ఆర్థిక చేయూత ఇవ్వాలని కోరారు.
అలాగే.. ఏపీ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.25 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.25 వేల నుంచి 30 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. ప్రధానమంత్రి ఎలాంటి భేదాలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాలన్నారు. అమెరికాలో ఇండియన్ విద్యార్థులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ట్రంప్ నిర్ణయాలను కోర్టు, సెనెట్‌లో అడ్డుకుంటామన్నారు.