మహా కుంభ్ కాదు.. మృత్యు కుంభ్.. సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

మహా కుంభ్ కాదు.. మృత్యు కుంభ్.. సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

కోల్‎కతా: ఉత్తరప్రదేశ్‎లోని ప్రయాగ్‎రాజ్‎లో జరుగుతోన్న మహా కుంభమేళాపై వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (ఫిబ్రవరి 18) బెంగాల్‎ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‎లో జరుగుతోన్న మహా కుంభ్.. మృత్యు కుంభ్‎గా మారిందని హాట్ కామెంట్స్ చేశారు. కుంభమేళా నిర్వహణలో యూపీ సర్కార్, కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ విఫలమయ్యాయని.. దీంతోనే కుంభమేళా మరణాలకు నిలయంగా మారిందని విమర్శించారు. కుంభమేళాలో ధనవంతులు, వీఐపీలకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు.. కానీ పేదలు, సామాన్యుల కోసం సరైన ఏర్పా్టు లేవని మండిపడ్డారు. 

‘‘ఇది మృత్యు కుంభ్.. నేను మహా కుంభ్‌ను గౌరవిస్తాను. పవిత్ర గంగా మాతను గౌరవిస్తాను. కానీ కుంభమేళా నిర్వహణకు ఎటువంటి ప్రణాళిక లేదు.. కుంభమేళా తొక్కిసలాటలో గాయపడిన వారు ఎంత మంది కోలుకున్నారు..? ధనవంతులు, వీఐపీలకు, లక్ష రూపాయల వరకు శిబిరాలు (టెంట్లు) అందుబాటులో ఉన్నాయి. కానీ పేదలకు కుంభ్‌లో ఎటువంటి ఏర్పాట్లు లేవు. మేళాలో తొక్కిసలాట సాధారణం కానీ ఏర్పాట్లు చేయడం ముఖ్యం. మీరు ఎలాంటి ప్రణాళిక తయారు చేశారు..?" అని ప్రశ్నించారు మమతా బెనర్జీ. 

ALSO READ | పడవలో ప్రయాగ్​రాజ్​కు.. రెండు రోజుల్లో 550 కిలోమీటర్లు ప్రయాణించిన ఏడుగురు బిహారీలు

అలాగే బంగ్లాదేశీయులతో మమతా బెనర్జీకి సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బంగ్లాదేశ్ ఛాందసవాదులతో తనకు సంబంధాలు ఉన్నట్లు నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు దీదీ. బంగ్లాదేశీయులతో సంబంధాలు ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యేలు చేస్తోన్న ఆరోపణలపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తానన్నారు. బీజేపీ రాజకీయ  ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే.. కోట్ల మంది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కుంభమేళాను మమతా బెనర్జీ మృత్యు కుంభ్ గా అభివర్ణించడంతో హిందువులు, హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి. మమతా బెనర్జీ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. టీఎంసీ హిందువుకు ఎప్పుడు వ్యతిరేకమనేది మమతా బెనర్జీ తాజా వ్యాఖ్యలతో మరోసారి రుజువైందని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.