వైఎస్ బతికి ఉన్నా తెలంగాణ వచ్చేది: కిరణ్​కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

= రాష్ట్ర విభజనపై 2009లోనే నిర్ణయం
= తెలంగాణకు అనుకూలమంటూ అసెంబ్లీలో తీర్మానం పెట్టుమన్నది ఆయనే
= ఈ బిల్లు పెడితే ఎన్నికలో ఓడిపోతామని చెప్పాను
= తర్వాత ప్రణభ్ ముఖర్జీతో మాట్లాడి 'మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు' అని మార్పించారు
= దురదృష్ట వశాత్తూ ఈ  రాష్ట్రం విడిపోయింది
= మాజీ సీఎం కిరణ్​  కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమరావతి/విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదని ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్​ కుమార్ రెడ్డి చెప్పారు. ఆయన విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ 2009లోనే నిర్ణయం తీసుకుందని అన్నారు. 2009 ఎన్నికలకు ముందు తాను చీఫ్ విప్‎గా ఉన్నానని, ఆ సమంలో వైఎస్సార్ తనను పిలిచి తెలంగాణకు అనుకూలమంటూ తీర్మానం పెట్టాలని సూచించారు. ఇప్పుడు ఈ బిల్లు పెడితే రాష్ట్రంలో అధికారం కోల్పోతామని చెప్పానని అన్నారు. అది పై నుంచి వచ్చిన ఆర్డర్ అని, తప్పక పాటించాలని అన్నారని తెలిపారు.

ALSO READ | మూలాలను మరవొద్దు..భారతీయ సంస్కృతి పునరుజ్జీవానికి కృషి చేద్దాం: వెంకయ్య నాయుడు

ప్రణభ్ ముఖర్జీ పంపారని చెప్పారన్నారు. ఒక్క సారి ప్రణభ్ ముఖర్జీతో మాట్లాడాలని రిక్వెస్ట్ చేశానని చెప్పారు. ఈ మేరకు మాట్లాడి స్వల్ప మార్పు చేయించారని అన్నారు. ‘తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు’ అని మార్పించారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేకపోయారన్న అపప్రధ తనపై సరికాదని, వైఎస్‌ ఉన్నా అడ్డుకోలేకపోయేవారని అన్నారు. రాష్ట్ర విభజన జరగదనే తాము అనుకున్నామని.. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయిందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వైఎస్ ఉన్నా విభజన ఆగేది కాదని చెప్పారు.