రేపో మాపో కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకే: ఎమ్మెల్యే కడియం సంచలన వ్యాఖ్యలు

రేపో మాపో కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకే: ఎమ్మెల్యే కడియం సంచలన వ్యాఖ్యలు

జనగాం: మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (జనవరి 2) ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు కేసీఆర్ కుటుంబం పెద్దఎత్తున తెలంగాణ వనరులను కొల్లగొట్టి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. నీతివంతులం.. నిజాయితీపరులమని మాట్లాడుతున్న మీ కుటుంబంపై ఎందుకు ఆరోపణలు వస్తున్నాయని నిలదీశారు. 

కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో ఇరుక్కొని తీహార్ జైలులో ఎన్ని రోజులు ఉందో రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. అలాగే ఫార్ములా ఈ కేసులో రేపో మాపో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా జైలుకు వెళ్లబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కడియం శ్రీహరి. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్, హరీష్ రావు అనేక విధాలుగా సాంకేతిక తప్పులు చేశారని ఆరోపణలు గుప్పించారు. 

కల్వకుంట్ల కుటుంబం అంతా రేపో మాపో జైలులో ఊచలు లెక్కపెట్టబోతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. మీరు నిజాయితీపరులు అయితే మీపై ఇన్ని కేసులు ఎందుకు నమోదు అవుతున్నాయని నిలదీశారు. 2014లో కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని.. ఇప్పుడు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు రూ.10 కోట్ల ఆస్తుల లేని మీకు.. ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని.. వందలాది ఎకరాల భూములు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. .