హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ సిబ్బందిపై దాడి జరిగిన కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే.. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే కుట్రకు ప్లాన్ చేసినట్లు పట్నం నరేందర్ రెడ్డి నేరం అంగీకరించాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే కుట్రలో భాగంగా బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతోనే లగచర్లలో అధికారులపై దాడి జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్‌కు తరుచూ ఫోన్ చేసినట్లు విచారణలో పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని.. కొందరికి డబ్బులు ఇచ్చి అధికారులపై దాడికి ఉసిగొల్పారని పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి నిందితుల దృష్టిని మళ్లించాడు. భూసేకరణ సమయంలో సర్వే లేదా పబ్లిక్ హియరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని.. లేకపోతే మీ భూములు మీకు దక్కవని భోగమోని సురేష్ ద్వారా రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడికి ఉసిగొల్పారని పేర్కొన్నారు.
ALSO READ | చర్లపల్లి జైలుకు BRS మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తరలింపు
ఆందోళనలు చేసిన వారికి అన్ని రకాల మద్దతు ఉంటుందని.. తమ పార్టీ ప్రముఖ నేత మిమ్మల్ని ఆదుకుంటారని రైతులకు, నిందితుడు సురేష్‌కు పట్నం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చాడని పోలీసులు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో సంచలం సృష్టిస్తోన్న లగచర్ల ఘటనలో ఏకంగా కేటీఆర్ పేరు తెరమీదకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో నెక్ట్స్ ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.