దంతెవాడ పేలుడు ఘటనలో బయటపడ్డ సంచలన విషయాలు

రాయ్​పూర్: దంతెవాడలో మావోయిస్టులు జరిపిన దారుణకాండలో డ్రైవర్​తో సహా పది మంది పోలీసులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు జరుపుతున్న విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మావోయిస్టులు పక్కా ప్లాన్​తోనే వ్యవహరించినట్లు తెలిసింది. దాదాపు 2 నెలలు లేదా అంతకంటే ముందే ఐఈడీ బాంబును అమర్చారని పోలీసులు చెబుతున్నారు. దీనికోసం రోడ్డు పక్క నుంచి సొరంగం తవ్వారని, దాదాపు 3 లేదా 4 అడుగుల లోతులో మందుపాతరను అమర్చారని వివరించారు. ప్రాథమికంగా లభించిన ఆధారాలను పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించామన్నారు. ఈ పేలుడు పదార్థాన్ని  ఆపరేట్​ చేయడానికి అమర్చిన వైర్లను అక్కడికి దగ్గర్లోని పొదలవరకూ భూమిని తవ్వి లోపల పాతారని చెప్పారు. ఇలా తవ్వి, మట్టి కప్పిన చోట గడ్డి మొలిచిందని వివరించారు. బాంబును గుర్తించకపోవడానికి ఇది కూడా కారణమైందని తెలిపారు. కాగా, దాడికి ముందురోజు ఆ రోడ్డుపై డీ మైనింగ్​ ఎక్సెర్​సైజ్​ జరిగిందని అధికారులు తెలిపారు. అయినా బాంబును గుర్తించలేకపోయామని చెప్పారు. బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు గాయపడ్డారని, వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు ఆరన్ పూర్ వస్తుండగా దాడి జరిగిందన్నారు. మొదటి వాహనం దాటి వెళ్లాక అలర్ట్​ అయ్యారని, రెండో వాహనాన్ని పేల్చేశారని వివరించారు.

చనిపోయినోళ్లలో మాజీ మావోయిస్టులు..

దంతెవాడ పేలుడు ఘటనలో చనిపోయిన పది మంది పోలీసులలో ఐదుగురు మాజీ మావోయిస్టులేనని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం, ప్రత్యేక బలగాలతో కూంబింగ్​ జరుపుతుండడంతో ఏటా చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నారని చెప్పారు. లొంగిపోయిన వారిలో కొంతమందిని డిస్ట్రిక్ రిజర్వ్  గార్డ్స్​ (డీఆర్జీ)లో చేర్చుకుని శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయ్యాక వారిని మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లకు పంపిస్తున్నట్లు చెప్పారు. ఇలా పోలీసులుగా మారిన మాజీ మావోయిస్టులలో ఐదుగురు తాజా పేలుడులో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వివరించారు.