
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో సెషన్లోనూ పరుగులు పెట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 520 పాయింట్ల లాభంతో గత నాలుగు నెలల్లో తొలిసారిగా 80వేల స్థాయికి చేరుకుంది. ఐటీ, ఆటో షేర్లలో లాభాలతో దూసుకెళ్లి 80,116.49 వద్ద స్థిరపడింది. ఇది డిసెంబర్ 18 తర్వాత అత్యధిక ముగింపు స్థాయి. ఇంట్రాడేలో 658.96 పాయింట్లు పెరిగి 80,254.55 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 161.70 పాయింట్లు ఎగిసి 24,328.95 వద్ద ముగిసింది.
విదేశీ నిధుల రాక, గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయని ఎనలిస్టులు తెలిపారు. సెన్సెక్స్ కంపెనీలలో హెచ్‌సీఎల్7.72 శాతం పెరిగింది. మార్చి క్వార్టర్లో నికర లాభం 8.1 శాతం పెరిగి రూ.4,307 కోట్లకు చేరుకోవడమే ఇందుకు కారణం. టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, మారుతి కూడా లాభాలను ఆర్జించాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.98 శాతం తగ్గి టాప్‌లూజర్‌గా నిలిచింది. దీంతో బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ అల్ట్రాటెక్ సిమెంట్ కూడా వెనకబడి ఉన్నాయి. మార్చి క్వార్టర్ఫలితాలు మెప్పించడంతో వారీ ఇంజనీర్స్షేర్లు 15 శాతం పెరిగాయి. గత ఏడు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద 36.65 లక్షల కోట్లు పెరిగింది.
ఆసియా మార్కెట్లు అదుర్స్..
ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి ఇండెక్స్, టోక్యోకు చెందిన నిక్కీ 225 హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ లాభపడగా, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ కొద్దిగా తగ్గింది. యూరప్‌లో మార్కెట్లు భారీగా పెరిగాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్ కాంపోజిట్ 2.71 శాతం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 2.66 శాతం, ఎస్అండ్పీ 500 2.51 శాతం ర్యాలీ చేశాయి.
ఎఫ్‌ఐఐలు మంగళవారం రూ. 1,290.43 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. అమెరికా–-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నట్లు కనిపించిందని, యూఎస్ టెక్ స్టాక్‌లలో ర్యాలీ మొత్తం ప్రపంచ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచిందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ పరిశోధనా విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు.
మెజారిటీ సూచీలకు లాభాలు
బీఎస్ఈ మిడ్‌క్యాప్ గేజ్ 0.94 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.26 శాతం పెరిగింది. బీఎస్ఈ సెక్టోరల్ఇండెక్స్లలో బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ 4.25 శాతం, ఐటీ 4 శాతం, టెక్ 3.10 శాతం, ఆటో 2.34 శాతం, రియాలిటీ 1.37 శాతం, కన్స్యూమర్ డిస్క్రెషనరీ 1.02 శాతం, హెల్త్‌కేర్ 0.96 శాతం, ఇండస్ట్రియల్స్ 0.84 శాతం పెరిగాయి.
ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకెక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ వెనకబడి ఉన్నాయి. బీఎస్ఈలో 2,078 స్టాక్‌లు లాభపడగా, 1,873 స్టాక్‌లు నష్టపోయాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 1.35 శాతం పెరిగి 68.35 డాలర్లకు చేరుకుంది. బీఎస్ఈ బెంచ్‌మార్క్ మంగళవారం 187.09 పాయింట్లు పెరిగి 79,595.59 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 41.70 పాయింట్లు పెరిగి 24,167.25 వద్ద ముగిసింది.