
ఇండియన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల క్రమంలో.. పెట్టుబడిదారులు భయాందోళనలకు గురవుతున్నారు. 24 గంటల్లో.. రెండు దేశాల్లో జరిగిన పరిణామాలతో యుద్ధ వాతావరణ నెలకొంది. ఇండియా, పాక్ దేశాల మధ్య సరిహద్దులు మూసివేతతోపాటు.. రెండు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిషేధించబడ్డాయి. భారత్, పాక్ రెండు దేశాలు వాణిజ్య పరంగా తెగతెంపులు చేసుకున్నాయి..
ఈ పరిణామాల మధ్య 2025, ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం ప్రారంభం అయిన భారత్ స్టాక్ మార్కెట్.. నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ అదే స్థాయిలో 350 పాయింట్లు పడిపోయి.. 24 వేల దిగువకు పడిపోయింది. స్టాక్ మార్కెట్ మొత్తం సంపదలో ఒక్క శాతం సంపద ఆవిరి అయ్యింది.
ఇక బ్యాంకింగ్ స్టాక్స్ సైతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.6 శాతం పడిపోయింది. యాక్సిస్ బ్యాంక్ షేర్ 3.5 శాతం నష్టపోయింది. అదానీ షేర్లు, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ట్రెంట్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడేలో ఈ షేర్లు 6 శాతం వరకు నష్టపోయాయి.
మిడ్ క్యాప్ షేర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు ఏకంగా 3 శాతం తగ్గాయి. దీంతో చిన్న ఇన్వెస్టర్లు లబోదిబో అంటున్నారు.
నాలుగు రోజులుగా లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్.. ఇండియా, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల క్రమంలో భారీ నష్టాల్లోకి వెళ్లింది. ఇన్వెస్టర్లు సైతం ప్రాఫిట్ బుకింగ్ కు దిగటంతో.. మరింత నష్టపోవచ్చని అంచనా వేస్తున్నారు ఆర్థికనిపుణులు.
ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలు స్పష్టంగా ఉండటంతోపాటు.. ఇండియా ఏ క్షణమైనా.. పాకిస్తాన్ పై తీవ్ర చర్యలకు దిగే అవకాశం ఉందన్న సంకేతాలు రావటంతో.. చాలా మంది ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగుతున్నారు. కొత్తగా పెట్టుబడి పెట్టే వాళ్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతుంది.