- రూ.2.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
న్యూఢిల్లీ: ఇన్‌ఫ్లేషన్ తగ్గడంతో సెన్సెక్స్, నిఫ్టీ గురువారం సెషన్‌లో కొత్త గరిష్టాలను టచ్ చేశాయి. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు మార్కెట్‌లో పెరిగాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 539 పాయింట్లు (0.70 శాతం) పెరిగి 77,145 దగ్గర ఆల్ టైమ్ గరిష్టాన్ని రికార్డ్ చేసింది. చివరికి 204 పాయింట్ల లాభంతో 76,811 దగ్గర సెటిలయ్యింది. నిఫ్టీ ఇంట్రాడేలో 23,481 లెవెల్ దగ్గర ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేయగా, 76 పాయింట్ల లాభంతో 23,399 దగ్గర సెషన్‌ను ముగించింది. దేశంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ మే నెలలో ఏడాది కనిష్టమైన 4.75 శాతానికి దిగొచ్చింది. ఆర్‌బీఐ పెట్టుకున్న లిమిట్ 6 శాతానికి దిగువన నమోదయ్యింది.
ఇన్‌ఫ్లేషన్ తగ్గుముఖం పడుతోందని, ఇలాంటి ట్రెండే యూఎస్ ఇన్‌ఫ్లేషన్‌లో కూడా కనిపిస్తోందని జియోజిత్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఇన్వెస్టర్ల సంపద గురువారం రూ.2.5 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.432 లక్షల కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఎల్ అండ్ టీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. మరోవైపు హిందుస్తాన్ యూనిలీవర్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
బ్రాడ్ మార్కెట్ అయిన బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.79 శాతం, బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.89 శాతం లాభపడ్డాయి. సెక్టార్ల పరంగా చూస్తే, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్, ఐటీ, కన్జూమర్ డిస్క్రిషనరీ ఇండెక్స్‌లు ర్యాలీ చేశాయి. టెలీకమ్యూనికేషన్, బ్యాంకెక్స్ ఇండెక్స్‌లు పడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) గురువారం నికరంగా రూ.3,033 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు నికరంగా రూ.553 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
ఈ ఏడాది ఫెడ్ రేట్ల కోత ఒకసారే..
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా 5.25 శాతం– 5.50 శాతం దగ్గర కొనసాగించింది. ఇన్‌ఫ్లేషన్ ఇంకా గరిష్టాల్లో ఉండడంతో ఈ ఏడాది ఒకసారి మాత్రమే రేట్ల కోత ఉంటుందనే సంకేతాలు ఇచ్చింది. దీంతో గురువారం సెషన్‌లో ఆసియా మార్కెట్‌లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. సియోల్, హాంకాంగ్ మార్కెట్లు పెరగగా, టోక్యో, షాంఘై మార్కెట్‌లు పడ్డాయి. యూరోపియన్ మార్కెట్‌లు నష్టాల్లో కదిలాయి.