ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ల పరుగు కొనసాగుతూనే ఉంది. ఇండెక్స్ హెవీ వెయిట్‌లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లలో విదేశీ పెట్టుబడులు పెరుగుతుండటంతో సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం కొత్త జీవితకాల గరిష్టాలకు ఎగబాకాయి. క్రూడ్ ధరలు నిలకడగా ఉండటం క్యాపిటల్ మార్కెట్‌లకు మద్దతును ఇచ్చాయి. వరుసగా ఆరో సెషన్‌లోనూ ర్యాలీ కొనసాగించిన 30 -షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 141.34 పాయింట్లు పెరిగి 77,478.93 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 305.5 పాయింట్లు పెరిగి 77,643.09 వద్దకు చేరుకుంది.
బీఎస్ఈలో 2,282 స్టాక్‌లు పెరిగాయి. 1,571 క్షీణించగా, 128 మారలేదు. గత ఆరు రోజుల్లో బీఎస్ఈ బెంచ్‌మార్క్ 1,022.34 పాయింట్లు లేదా 1.33 శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి తాజా ముగింపు గరిష్ట స్థాయి 23,567 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలో, ఇది 108 పాయింట్లు లేదా 0.45 శాతం పెరిగి 23,624 వద్దకు చేరుకుంది. ఎఫ్‌ఐఐలు గత మూడు రోజులుగా భారతీయ ఈక్విటీలను కొంటున్నారని, దీంతో మార్కెట్లు పుంజుకుంటున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అన్నారు.
సెన్సెక్స్ కంపెనీల్లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. అయితే, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, విప్రో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పవర్ గ్రిడ్ నష్టాలపాలయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ గేజ్ 1 శాతం జంప్ చేయగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.55 శాతం ర్యాలీ చేసింది. సూచీలలో రియాల్టీ 1.97 శాతం, కమోడిటీలు 1.88 శాతం, మెటల్ 1.87 శాతం, ఇంధనం 0.90 శాతం, ఇండస్ట్రియల్స్ 0.50 శాతం పెరిగాయి. టెలికం, యుటిలిటీస్, ఆటో, పవర్ టెక్ వెనుకబడి ఉన్నాయి. స్విస్ నేషనల్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించడంతో యూరోపియన్ స్టాక్‌లు బలపడ్డాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్ టోక్యోలు గ్రీన్‌లో స్థిరపడగా, షాంఘై, హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి. బుధవారం యూఎస్ మార్కెట్లు పనిచేయలేదు. ఎఫ్‌ఐఐలు బుధవారం రూ.7,908.36 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.16 శాతం పెరిగి 85.21 డాలర్లకు చేరుకుంది.