
Sensex Crash: భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు సుదీర్ఘ వారాంతపు సెలవుల తర్వాత తిరిగి తెరచుకున్నాయి. అయితే నిపుణులు ముందుగానే హెచ్చరించినట్లుగా నేడు భారతీయ మార్కెట్లు పతనం దిశగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా బెంచ్ మార్కె సూచీలు ఉదయం 11.07 గంటల సమయంలో గమనిస్తే సెన్సెక్స్ 1153 పాయింట్లు కోల్పోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 285 పాయిట్ల పతనంతో ముందుకు సాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 710 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 380 పాయింట్లకు పైగా పతనంతో ఉన్నాయి.
వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న లిబరేషన్ డే దగ్గరపడటంతో అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన వాణిజ్య పన్నుల అమలుకు రంగం సిద్ధం అవుతోంది. దీంతో ఇండియాపే ప్రకటించబడే సుంకాలపైనే అందరి దృష్టి కొనసాగుతోంది. దీంతో మార్కెట్లోని ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. చాలా మంది ముందస్తుగానే నష్టాలను తగ్గించుకునేందుకు తమ వాటాల విక్రయానికి దిగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరికొందరు ప్రస్తుతం లాభాల్లో ఉన్న పోర్ట్ ఫోలియో స్టాక్స్ విక్రయిస్తూ.. తిరిగి వాటిని తక్కువ ధరల వద్ద కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి ముందు ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారతీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగిన కరెక్షన్ బలహీనమైన భారత ఆర్థికాభివృద్ధి డేటా, నిరాశపరిచిన కార్పొరేట్ ఆదాయాలు, ఎఫ్ఐఐల అమెరికా, చైనా మార్కెట్లలో మంచి అవకాశాలను చూస్తూ మన మార్కెట్లను నిష్క్రమించటం వల్ల ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మరోసారి ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ పన్నుల ప్రకటన భయాలు దేశీయ మార్కెట్లలో భయాలను ప్రేరేపించాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్లో భేర్స్ రంగంలోకి దిగారు. అయితే ఇది స్వల్ప కాలిక కరెక్షన్ గా ఉంటుందా లేక మరికొన్ని వారాలు కొనసాగుతుందా అనే విషయం ట్రంప్ ప్రకటన ప్రభావం అంచనాల తర్వాతే తెలియనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
దిగజారిన ఐటీ స్టాక్స్..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తున్న పరస్పర సుంకాల భయాల మధ్య భారతీయ ఐటీ రంగంలోని కంపెనీలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. దీంతో నేడు మార్కెట్లలో ఐటీ స్టాక్స్ పతనం బెంచ్ మార్క్ సూచీలను కోలుకోలేని నష్టాల్లోకి దిగజార్చాయి. ఈ క్రమంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మారుతీ వంటి కంపెనీల షేర్లు భారీ నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.
మార్కెట్ల పతనానికి ఇతర కీలక కారణాలివే..
- ముందుగా డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రకటిస్తున్న పరస్పర సుంకాలు ఆందోళనలను కలిగిస్తున్నాయి. కెనడా, మెక్సికో, చైనా, ఇండియా వంటి దేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యే జాబితాలో ఉన్నాయి. ఆటోమెుబైల్స్, స్టీల్, అల్యూమినియం, కాపర్, ఫార్మా, సెమీకండక్టర్లు వంటి రంగాలు ప్రభావితం కానున్నాయి.
- ఇక మార్కెట్ల పతనానికి దారితీసిన మరో అంశం పెరిగిన క్రూడ్ ధరలు. పెరుగుతున్న ధరలు భారత్ వంటి దిగుమతిదారులకు ఆందోళనలు కలిగిస్తున్నాయి.
- ట్రంప్ చర్యల మధ్య అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి అడుగుపెట్టే ప్రమాదం ఉందని 35 శాతం ఉందని గోల్డ్‌మాన్ శాచ్స్ అంచనాలు ప్రపంచ దేశ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి.
- భారతీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తిరిగి అమ్మకాలను ప్రారంభించటం మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీసింది. చాలా మంది అమెరికా, చైనా వంటి మార్కెట్లలో పెట్టుబడి అవకాశాలను వినియోగించుకునేందుకు భారత మార్కెట్లను వీడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.