ముంబై: బెంచ్‌మార్క్ సెన్సెక్స్ మంగళవారం దాదాపు 91 పాయింట్లు పెరిగి తాజా జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. నిఫ్టీ మొదటిసారిగా 25,400 స్థాయికి ఎగువన స్థిరపడింది. వడ్డీ రేట్లపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 90.88 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 83,079.66 వద్ద స్థిరపడింది. తొలిసారిగా 83వేల స్థాయికి ఎగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 163.63 పాయింట్లు పెరిగి 83,152.41 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 34.80 పాయింట్లు లాభపడి 25,400 స్థాయికి ఎగువన 25,418.55 వద్ద స్థిరపడి రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది.
అప్పర్ సర్క్యూట్‌ను తాకిన బజాజ్ హౌసింగ్ షేర్లు
కొత్తగా లిస్టయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు మంగళవారం 10 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ పరిమితిని తాకాయి. లిస్టింగ్ రోజు లాభాలను పొడిగించాయి. బీఎస్ఈలో అప్పర్ సర్క్యూట్ పరిమితి రూ.181.48ని తాకడంతో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లింది. ఎన్ఎస్ఈలో సంస్థ షేర్లు 10 శాతం పెరిగి రూ. 181.50కి చేరుకున్నాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.13,733.12 కోట్లు పెరిగి రూ.1,51,139.21 కోట్లకు చేరుకుంది. ఈ షేరు ఇష్యూ ధర రూ.70 నుంచి 159.28 శాతం పెరిగింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశంలోనే అత్యధిక మార్కెట్క్యాప్ కలిగిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా ఎదిగింది.