ముంబై: ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం ఇంట్రాడే నష్టాల నుంచి షార్ప్‌గా రికవర్ అయ్యింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 5 శాతం పతనమవ్వడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెషన్ మొత్తం నష్టాల్లో కదిలాయి. చివరి గంటలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్లు పెరగడంతో ఆల్ టైమ్ క్లోజింగ్ హై అయిన 24,324 దగ్గర నిఫ్టీ సెటిలయ్యింది. బీఎస్ఈ సెన్సెక్స్ రికార్డు స్థాయి నుంచి వెనక్కి తగ్గింది.
ఇన్వెస్టర్లు అనిశ్చితంగా ఉండటంతో 80 వేల మార్క్ దిగువకు జారింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తన రికార్డ్ -బ్రేకింగ్ రన్‌ను కొనసాగించింది. శుక్రవారం 21.70 పాయింట్లు పెరిగింది. కొన్ని కౌంటర్లలో ఫాగ్-ఎండ్ కొనుగోళ్ల వల్ల ఇది పెరిగింది. నిఫ్టీలో 34 షేర్లు పెరగగా, 16 క్షీణించాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 53.07 పాయింట్లు పడిపోయి 79,996.60 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో మొత్తం 2,242 స్టాక్‌లు పురోగమించగా, 1,686 క్షీణించగా, 88 మారలేదు. వారంవారీ ప్రాతిపదికన, బీఎస్ఈ సెన్సెక్స్ 963.87 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 313.25 పాయింట్లు లాభపడింది.
నిఫ్టీ రోజంతా ప్రతికూలంగా ట్రేడయిందని, సెషన్ చివరి అరగంటలో రికవరీ కావడం వల్ల సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా చెప్పారు. సెన్సెక్స్ 30 షేర్లలో ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్‌టీపీసీ, లార్సెన్ అండ్ టూబ్రో, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మాస్యూటికల్స్ లాభపడ్డాయి.
అయితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్ వెనకబడి ఉన్నాయి. గురువారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. మిడ్ సెషన్ డీల్స్‌లో యూరోపియన్ మార్కెట్లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం అమెరికా మార్కెట్లు ముగిశాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ గేజ్ 0.70 శాతం పెరిగింది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.75 శాతం పెరిగింది.
సెక్టోరల్ ఇండెక్స్‌లు ఇలా...
సెక్టోరల్ ఇండెక్స్‌లలో ఆయిల్ అండ్ గ్యాస్ 1.77 శాతం, ఇంధనం 1.70 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.55 శాతం, ఇండస్ట్రియల్స్ 1.48 శాతం, పవర్ 1.24 శాతం పెరిగాయి. అయితే, ఆర్థిక సేవలు 0.59 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.43 శాతం, బ్యాంక్ 0.18 శాతం, ఐటీ 0.13 శాతం, టెక్ 0.06 శాతం పడిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు 3 శాతం జంప్ చేసి 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.3,197.65ను తాకాయి. కంపెనీ మార్కెట్క్యాప్ రూ.48,723.54 కోట్లు పెరిగి రూ.21,51,562.56 కోట్లకు చేరుకుంది. టెక్స్‌టైల్ మేజర్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని డీమెర్జ్ చేస్తామని చెప్పడంతో రేమండ్ స్టాక్ 9 శాతానికి పైగా పెరిగింది.