- 284 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
ముంబై: బ్యాంకింగ్, ఆటో షేర్లలో ప్రాఫిట్ బుకింగ్, యూఎస్ ఫెడ్సమావేశం కోసం ఎదురుచూపులు, ఎఫ్ఐఐల ఔట్‌ఫ్లోల కారణంగా బెంచ్‌మార్క్ సెన్సెక్స్ గురువారం 836 పాయింట్లు పతనమైంది. ఇది 1.04 శాతం పడిపోయి 79,541.79 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 958.79 పాయింట్లు క్షీణించి 79,419.34 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 284.70 పాయింట్లు క్షీణించి 24,199.35 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ప్యాక్ నుంచి, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్కువగా నష్టపోయాయి.
ఎస్బీఐ మాత్రమే లాభపడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) బుధవారం రూ. 4,445.59 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ గేజ్ 0.67 శాతం క్షీణించగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.44 శాతం తగ్గింది. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్, షాంఘై, హాంకాంగ్ లాభాల్లో స్థిరపడగా, టోక్యో నష్టపోయింది. యూరోపియన్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ బుధవారం బాగా పెరిగింది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.33 శాతం తగ్గి 74.67 డాలర్లకు చేరుకుంది.