బెంచ్ మార్క్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు సోమవారం (13 జనవరి) భారీగా పడిపోయాయి. ఓపెనింగ్ లో తీవ్ర నష్టాలకు గురైన మార్కెట్లు కొంత కోలుకున్నట్లు అనిపించినా బ్యాంకింగ్, మెటల్ సెక్టార్ లో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో తీవ్ర నష్టాలకు లోనయ్యాయి.
మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే 9.20 ని.ల ప్రాంతంలో సెన్సెక్స్ (S&P BSE Sensex) 657.97 పాయింట్లు కోల్పోయి 76,720.94 పాయిట్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. అదేవిధంగా నిఫ్టీ ( NSE Nifty50) 199.60 పాయింట్ల పతనంతో 23,231.90 స్థాయికి చేరుకుంది.
శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు వరుస మూడు రోజుల నష్టాలను కొనసాగిస్తూ లాస్ లో ముగిశాయి. సోమవారం కూడా అదే ట్రెండ్ కొనసాగడంతో కనిస్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో మార్కెట్ లో బ్లడ్ బాత్ కొనసాగిందనీ చెప్పవచ్చు.
మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో సూచీలపై ప్రతికూల ప్రభావం పడింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.5 లక్షల కోట్లు ఆవిరై రూ.430 లక్షల కోట్ల నుంచి రూ.425 లక్షల కోట్లకు పడిపోయింది. గత నాలుగు సెషన్లలో చూస్తే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.17 లక్షల కోట్లు ఆవిరైంది.
మార్కెట్ పతనానికి ముఖ్య కారణాలు:
1. ఆందోళన కలిగిస్తున్న రూపాయి పతనం:
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తో పోల్చితే రూపాయి దారుణంగా క్షీణిస్తోంది. సోమవారం 23 పైసలు తగ్గి 86.24 చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోయింది. యూఎస్ జాబ్స్ డాటా అంచనాలకు మించి పెరగడంతో ఫెడరల్ బ్యాంకు రేట్ కట్స్ ఉంటాయనే అంచనాలతో డాలర్ క్రమంగా పెరిగిపోయింది. దీంతో రూపాయి మరింత క్షీణితకు గురైంది.
4. యూఎస్ జాబ్స్ డేటాపై ఆందోళన:
డిసెంబర్ 2024 లో 2.56 లక్షల జాబ్స్ డేటా అంచనాలకు మించి రావడం దీనికి కారణం. ఫెడ్ డిసెంబర్ లో 1.65 లక్షల జాబ్స్ ఉంటాయని అంచనా వేసింది. అంటే యూఎస్ నిరుద్యోగిత రేటు 4.1% కి పడిపోయింది. జాబ్స్ డాటా పెరగడంతో ఈ ఏడాది ఫెడ్ రేట్ కట్ ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్ విజయ్ కుమార్ తెలిపారు.
3. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల:
క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కు 81 డాలర్లకు పెరిగిపోయింది. ధరలు పెరుగుతుండటం ఇండియాకు ఆందోళన కలిగించే విషయం. ఆయిల్ ధరల పెరుగుదలతో ఇన్ ఫ్లేషన్ పెరుగుతుందనే భయాలతో భారీ సెల్ ఆఫ్ మార్కెట్లో కొనసాగింది.
4. యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఎఫ్ పీఐల అమ్మకాలు:
యూఎస్ బాండ్ ఈల్డ్స్ క్రమంగా పెరుగుతుండటంతో.. డాలర్ లో ఇన్వెస్ట్ మెంట్స్ పెరిగిపోయాయి. ఇండియా నుంచి కోట్ల సంపదను అమ్మి యూఎస్ బాండ్స్, డాలర్లలో పెట్టుబడులు పెడుతున్నారు ఫారెన్ ఇన్వెస్టర్లు(ఎఫ్ పీఐ). మార్కెట్ పతనానికి ఇది కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు.