- 700 పాయింట్లు డౌన్
- 208 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- ఇన్వెస్టర్లకు రూ.4.52 లక్షల కోట్ల లాస్
ముంబై: ఈక్విటీ బెంచ్‌మార్క్ బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం దాదాపు 700 పాయింట్లు పతనమై 79 వేల దిగువ స్థాయికి పడిపోయింది. ఎఫ్‌ఐఐల ఔట్ఫ్లోలతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐటీసీలలో అమ్మకాల ఒత్తిడి కారణంగా వరుసగా రెండవ రోజూ నష్టాలు తప్పలేదు. కమోడిటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్‌లలో భారీ నష్టాలు కూడా మార్కెట్ క్షీణతకు కారణమయ్యాయి.30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 692.89 పాయింట్లు పతనమై 78,956.03 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 759.54 పాయింట్లు తగ్గి 78,889.38కి చేరుకుంది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 208 పాయింట్లు క్షీణించి 24,139 వద్దకు చేరుకుంది. బీఎస్ఈలో మొత్తం 2,676 స్టాక్‌లు తగ్గాయి. దీంతో ఇన్వెస్టర్లకు రూ.4.52 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఐఐటీ డేటా బలహీనంగా ఉండటం, ఎఫ్‌ఐఐల అమ్మకాలు, ఎలివేటెడ్ వాల్యుయేషన్‌లు నష్టాలకు మరింత దోహదం చేశాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
హెచ్‌డీఎఫ్‌సీ 3 శాతానికిపైగా డౌన్
సెన్సెక్స్ కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3 శాతానికి పైగా క్షీణించింది. టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ వెనుకబడి ఉన్నాయి. అయితే, టైటాన్, హెచ్‌సిఎల్ టెక్, నెస్లే, సన్ ఫార్మా, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభపడ్డాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ గేజ్ 1.16 శాతం క్షీణించగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.98 శాతం పడిపోయింది. ఇండెక్స్‌లలో కన్స్యూమర్ డ్యూరబుల్స్ మాత్రమే లాభపడింది. ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో, షాంఘై హాంకాంగ్ సానుకూలంగా ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు ఎక్కువగా గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
ఎంఎస్‌సీఐలో ఉండే షేర్లు ఇవే
ఎంఎస్సీఐ తాజా ఇండెక్స్ సమీక్ష ప్రకారం, వోడాఫోన్ ఐడియా, ఆయిల్ ఇండియాతో సహా ఏడు సంస్థలు ఎంఎస్సీఐ ఇండియా ఇండెక్స్‌లో ఈ నెల 30 నుంచి చేరుతాయి. డిక్సన్ టెక్నాలజీస్ (ఇండియా), ఆయిల్ ఇండియా, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్, రైల్ వికాస్ నిగమ్, వొడాఫోన్ ఐడియా, జైడస్ లైఫ్ సైన్సెస్ ఎంఎస్సీఐ ఇందులో ఉంటాయి.