సెన్సెక్స్ థౌజండ్​వాలా.. యుద్ధం భయం పోయినట్లేనా.. మార్కెట్లో ఈ లాభాలు ఎంత వరకు ఉండొచ్చు..?

సెన్సెక్స్ థౌజండ్​వాలా.. యుద్ధం భయం పోయినట్లేనా.. మార్కెట్లో ఈ లాభాలు ఎంత వరకు ఉండొచ్చు..?

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్​తోపాటు  ప్రైవేట్ బ్యాంకుల షేర్లలో భారీ ర్యాలీతో సెన్సెక్స్ సోమవారం (ఏప్రిల్ 28) 1,006 పాయింట్లు పెరిగి 80వేల స్థాయిపైన ముగిసింది. భారత్​,- పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, విదేశీ నిధుల ప్రవాహం వల్ల స్టాక్ మార్కెట్లు రెండు రోజుల నష్టాలకు బ్రేకులేశాయి. 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 1,005.84 పాయింట్లు పెరిగి 80,218.37 వద్ద స్థిరపడింది. 

ఇందులోని 23 షేర్లు లాభాలతో ముగిశాయి.  ఏడు మాత్రమే నష్టాల పాలయ్యాయి. ఇంట్రాడేలో   1,109.35 పాయింట్లు పెరిగి 80,321.88కి చేరుకుంది. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ నిఫ్టీ 289.15 పాయింట్లు ర్యాలీ చేసి 24,328.50 వద్ద ముగిసింది. ఐటీ మినహా అన్ని కీలక రంగాలు దూసుకెళ్లాయి. ఫార్మా, ఎనర్జీ, ఆటో భారీ లాభాలు సంపాదించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 5.27 శాతం పెరిగి సెన్సెక్స్ స్టాక్‌‌‌‌లలో టాప్ గేనర్​గా నిలిచింది. మార్చి క్వార్టర్​లో నికర లాభం అంచనాలను మించి 2.4 శాతం పెరగడంతో స్టాక్స్​ దూసుకెళ్లాయి. ఎంఎస్​ఎల్​ఇసుజును రూ.555 కోట్లకు కొంటున్నట్టు ప్రకటించడంతో మహీంద్రా అండ్​ మహీంద్రా షేర్లు 2.29 శాతం పెరిగాయి.

 అయితే ఎస్​ఎంఎల్​ఇసుజు లిమిటెడ్ షేర్లు 10 శాతం పడిపోయాయి. సెన్సెక్స్ నుంచి సన్ ఫార్మా, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, లార్సెన్ అండ్​ టూబ్రో, ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్కువగా లాభపడ్డాయి. హెచ్‌‌‌‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే  హిందూస్తాన్ యూనిలీవర్ వెనకబడి ఉన్నాయి.  ఎఫ్‌‌‌‌ఐఐలు శుక్రవారం రూ.2,952.33 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ప్రపంచ మార్కెట్లు, దేశీయ స్థూల ఆర్థిక వ్యవస్థ బాగుండటంతో గత వారం విదేశీ పెట్టుబడిదారులు దేశ ఈక్విటీ మార్కెట్లలో రూ.17,425 కోట్లు ఇన్వెస్ట్​ చేశారు. "సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా గత వారం చివరి రెండు రోజుల్లో సంభవించిన నష్టాల నుంచి దేశీయ మార్కెట్ కోలుకుంది. 

ఎఫ్‌‌‌‌ఐఐల నుంచి నిరంతర కొనుగోళ్లు, రిలయన్స్ ఫలితాలు బాగుండటం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్లను పెంచాయి. డాలర్ బలహీనపడటం,  అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిడి విదేశీ పెట్టుబడిదారులను దేశీయ మార్కెట్‌‌‌‌లోకి ఆకర్షించవచ్చు" అని జియోజిత్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్ లిమిటెడ్ పరిశోధనా విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు.

లాభాల్లో సూచీలు..

బీఎస్ఈ మిడ్‌‌‌‌క్యాప్ గేజ్ 1.34 శాతం, స్మాల్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.39 శాతం పెరిగాయి. బీఎస్ఈ రంగాల సూచీలలో, ఇంధనం 3.02 శాతం, చమురు, గ్యాస్ 2.90 శాతం, క్యాపిటల్​గూడ్స్​ 1.93 శాతం, ఆరోగ్య సంరక్షణ 1.60 శాతం, మెటల్ 1.59 శాతం, బ్యాంకెక్స్ 1.53 శాతం,  రియాలిటీ 1.41 శాతం పెరిగాయి. ఐటీ,  బీఎస్ఈ ఫోకస్డ్​ ఐటీ వెనకబడి ఉన్నాయి. "గత వారాంతంలో భారతదేశం,  పాకిస్తాన్ మధ్య ఎటువంటి రాజకీయ పరిణామాలు లేకపోవడం, ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వం మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించాయి. 

ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్‌‌‌‌ షేర్లలో ర్యాలీతో మార్కెట్లు పుంజుకున్నాయి”అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్‌‌‌‌  సీనియర్​ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు. ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్,  టోక్యో నిక్కీ 225 లాభాల్లో ముగియగా, షాంఘై ఎస్​ఎస్​ఈ కాంపోజిట్,  హాంకాంగ్‌‌‌‌ హాంగ్ సెంగ్ నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు లాభపడ్డాయి.