
- 325 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- ఇన్వెస్టర్లకు రూ.8.67 లక్షల కోట్ల లాభం
ముంబై:గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ, ఎం అండ్ ఎం కౌంటర్లలో భారీ కొనుగోళ్ల వల్ల సెన్సెక్స్మంగళవారం 75 వేల మార్కును తాకింది. చమురు ధరలు తగ్గడం, డాలర్బలహీనపడటంతో ఇది రెండో రోజూ భారీగా లాభపడింది. ఏకంగా 1,131.31 పాయింట్లు పెరిగి 75,301.26 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 1,215.81 పాయింట్లు పెరిగి 75,385.76 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 2,815 స్టాక్‌లు లాభపడగా, 1,221 క్షీణించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 325.55 పాయింట్లు పెరిగి 22,834.30 వద్ద ముగిసింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.8.67 లక్షల కోట్లు పెరిగింది.
ప్రపంచ ఈక్విటీలలో ర్యాలీ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచిందని, వాల్యూ బయింగ్ఊపందుకుందని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వైస్–ప్రెసిడెంట్(రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే అన్నారు. టారిఫ్ వార్తో దేశీయ వృద్ధి మందగిస్తుందనే భయాల కారణంగా రికవరీని నిలబెట్టుకోవడం కష్టమేనని అన్నారు.
సెన్సెక్స్ ప్యాక్‌లో జొమాటో 7 శాతానికి పైగా పెరిగింది. తరువాతి స్థానాల్లో ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టూబ్రో, ఏషియన్ పెయింట్స్, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ ఉన్నాయి. అయితే బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనకబడి ఉన్నాయి. బీఎస్ఈ స్మాల్-క్యాప్ గేజ్ 2.73 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.10 శాతం పెరిగింది.
అన్ని సూచీలూ లాభాల్లోనే..
బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి. రియల్టీ 2.95 శాతం, ఇండస్ట్రియల్స్ 2.79 శాతం, కన్జూమర్ డిస్క్రెషనరీ 2.76 శాతం, క్యాపిటల్గూడ్స్ 2.44 శాతం, ఆటో 2.42 శాతం, విద్యుత్ 2.27 శాతం, ఆర్థిక సేవలు 2.09 శాతం, బ్యాంకెక్స్ 1.98 శాతం పెరిగాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ లాభపడ్డాయి. యూరోపియన్ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి.
"గ్లోబల్‌మార్కెట్లలో ర్యాలీ కారణంగా బెంచ్‌మార్క్‌లు బలమైన రికవరీని సాధించాయి. అమెరికా, చైనా నుంచి మెరుగైన రిటైల్ అమ్మకాల డేటా సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. మిడ్, స్మాల్-క్యాప్ స్టాక్‌లు రాణించాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్‌హెడ్ వినోద్ నాయర్ అన్నారు. టారిఫ్ వార్, చైనా మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండటం వల్ల ఎఫ్ఐఐలు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని వివరించారు.
ఎఫ్ఐఐలు సోమవారం రూ.4,488.45 కోట్ల విలువైన ఈక్విటీలను ఆఫ్‌లోడ్ చేయగా, డీఐఐలు రూ.6,000.60 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఎఫ్ఐఐలు మంగళవారం రూ.695 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. బ్రెంట్ క్రూడ్ ధర1.48 శాతం పెరిగి 72.12 డాలర్లకు చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసలు ఎగిసి రూ.86.56కు పెరిగింది.