- 3 నెలల కనిష్టానికి సెన్సెక్స్
- 941 పాయింట్లు డౌన్
- 309 పాయింట్లు పడ్డ నిఫ్టీ
న్యూఢిల్లీ: భారీ అమ్మకాల కారణంగా సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ ఒక శాతానికి పైగా పతనమైంది. దీంతో ఈక్విటీ మార్కెట్ల ఇన్వెస్టర్ల సంపద రూ. 5.99 లక్షల కోట్లు క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. యూఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు నిర్ణయం ఈ వారంలో ప్రకటిస్తుండటంతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించారు. సెన్సెక్స్ 941.88 పాయింట్లు క్షీణించి 78,782.24 వద్ద స్థిరపడింది. ఇది ఆగస్టు 6 నుంచి కనిష్ట ముగింపు స్థాయి. ఇంట్రాడేలో 1,491.52 పాయింట్లు తగ్గి 78,232.60 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 309 పాయింట్లు పతనమై 23,995 పాయింట్లకు తగ్గింది.
దీంతో బీఎస్ఈ- లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,99,539.5 కోట్లు తగ్గి రూ. 4,42,11,068.05 కోట్లకు ( 5.26 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది. యూఎస్ ఎన్నికల ఫలితాలు, రాబోయే కొద్ది రోజుల్లో ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయానికి ముందు పెట్టుబడిదారులు నష్టాలకు దూరంగా ఉన్నారని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వైస్–ప్రెసిడెంట్ (పరిశోధన) ప్రశాంత్ తాప్సే అన్నారు. కార్పొరేట్ ఆదాయాలు అంచనాలను అందుకోవడంలో విఫలమవడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ మరింత దిగజారిందని వివరించారు. 30-షేర్ల సెన్సెక్స్ ప్యాక్ నుంచి, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, ఎన్టీపీపీ, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్ వెనకబడి ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభపడ్డాయి.
భారీగా ఎఫ్ఐఐల అమ్మకాలు
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) సోమవారం రూ.4,330 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. వీళ్లు అక్టోబర్‌లో భారతీయ స్టాక్ మార్కెట్ నుంచి ఏకంగా రూ. 94,000 కోట్లను (సుమారు 11.2 బిలియన్ డాలర్లు) ఉపసంహరించుకున్నారు. ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘై, హాంకాంగ్ లాభాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లూ లాభాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 3 శాతం పెరిగి 75.29 డాలర్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే సోమవారం మార్కెట్లోకి వచ్చిన అఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు మొదట నిరాశపరిచినా, తర్వాత తిరిగి పుంజుకున్నాయి. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ షేర్లు ఇష్యూ ధర రూ.463 కంటే 2.49 శాతం లాభంతో ముగిశాయి. బీఎస్ఈలో ఇష్యూ ధర నుంచి 7.11 శాతం తగ్గింపుతో షేరు రూ.430.05 వద్ద ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో 9.31 శాతం క్షీణించి రూ.419.85కి చేరుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో 7.99 శాతం క్షీణతతో రూ.426 వద్ద లిస్టయ్యాయి. సంస్థ షేర్లు చివరకు 2 శాతం వృద్ధితో రూ.472.60 వద్ద ముగిశాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.17,453.22 కోట్లుగా ఉంది.