
Sensex Crash: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న ప్రపంచ దేశాలపై 10 శాతం నుంచి గరిష్ఠంగా 50 శాతం మధ్య వివిధ దేశాలపై పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాత్రి అమెరికా మార్కెట్లలో మెుదలైన భయాలతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు 2.5 బిలియన్ డాలర్ల మేర పతనమైంది. అయితే దీనికి ధీటుగా చైనా, కెనడాలు కూడా ప్రతీకార పన్నులను ప్రకటించటం పరిస్థితులు పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం దిశగా పయనిస్తున్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి.
అయితే ఈ వాణిజ్య యుద్ధ ప్రభావంపై ఆందోళనలు భారతీయ స్టాక్ మార్కెట్లను సైతం తాకాయి. దీంతో నేడు మార్కెట్లు కుప్పకూలటం ప్రారంభించాయి. ఉదయం 10.53 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 750 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 280 పాయింట్లు నష్టంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిన్న లాభాలతో ముగిసిన నిఫ్టీ బ్యాంక్ సూచీ ప్రస్తుతం 35 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ మిడ్ క్యాప్ నిన్నటి లాభాలు ఆవిరై ఏకంగా 1150 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతోంది.
Also Read :- ట్రంఫ్ ఎఫెక్ట్‌తో తగ్గిన గోల్డ్ రేట్లు
నేడు మార్కెట్లు భారీగా పతనం కావటానికి ప్రధాన కారణం ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ వంటి రంగాల షేర్లు భారీగా పతనాన్ని నమోదు చేయటమే. ఈ రంగాల షేర్లలో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి లేదా లాభాల స్వీకరణ కారణంగా బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకు పైగా భారీ నష్టాన్ని ఇంట్రాడేలో చూసింది. ప్రపంచ మార్కెట్లలో కొనసాగుతున్న ట్రేడ్ వార్ భయాలతో పాటు ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, కొన్ని రంగాల షేర్లలో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి, నిరంతరాయంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారతీయ స్టాక్ మార్కెట్లలో తమ వాటాలను విక్రయించటం, అమెరికా-భారత సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీ రేట్ల తగ్గింపులపై చేయనున్న కీలక ప్రకటనలకు అనుగుణంగా ఇన్వెస్టర్లు మార్కెట్లలో ముందుకు సాగుతున్నారు.
ట్రంప్ కొత్త బాంబ్ ఏంటి..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అధికారులు ఫార్మా రంగంపై టారిఫ్స్ విధించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారని వెల్లడించటం కొత్త ఆందోళనలకు దారితీసింది. సమీప భవిష్యత్తులో ఫార్మా రంగం ఉత్పత్తులు కూడా ట్రంప్ టారిఫ్స్ కిందకు రానున్నాయి.. అయితే అవి మీరెవ్వరూ కలలో కూడా ఊహించని భారీ స్థాయిలో ఉండనున్నట్లు ట్రంప్ తాజాగా తన ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించటం ప్రకంపనలు సృష్టిస్తోంది. రానున్న కాలంలో ఫార్మా తయారీ రంగాన్ని తిరిగి అమెరికాకు తీసుకొచ్చే ప్రణాళికతో ట్రంప్ ఉన్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరొలినీ లెవిట్ వెల్లడించారు. ప్రజల ప్రాణాలు కాపాడే మందులు అమెరికాలో తయారు చేయటం కీలకమని ఆమె పేర్కొన్నారు.
ఈ ప్రకటన బయటకు రావటంతో నేడు ఇంట్రాడేలో నిఫ్టీ ఫార్మా సూచీ కుప్పకూలంది. దాదాపు 2.5 శాతం మేర పతనాన్ని నమోదు చేసింది. Aurobindo Pharma, Lupin, IPCA Labs వంటి అనేక ఫార్మా కంపెనీల షేర్లు పతనాన్ని నమోదు చేశాయి.