Market Fall: చైనాపై విరుచుకుపడిన ట్రంప్.. కుప్పకూలిన సెన్సెక్స్-నిఫ్టీ, మరి ఇన్వెస్టర్ల దారెటు..?

Market Fall: చైనాపై విరుచుకుపడిన ట్రంప్.. కుప్పకూలిన సెన్సెక్స్-నిఫ్టీ, మరి ఇన్వెస్టర్ల దారెటు..?

Sensex-Nifty: నష్టాల నుంచి తేరుకున్న ఒక్కరోజులోనే దేశీయ స్టాక్ మారక్కెట్లు తిరిగి పతనం దిశగా పయనిస్తున్నాయి. అమెరికా కఠిన సుంకాలపై చైనా ప్రతీకార సుంకాలను ప్రకటించిన వేళ వివాదం మరింతగా ముదురుతోంది. నిన్న ట్రంప్ ఏకంగా చైనాపై 104 శాతం సుంకాలను ప్రకటించటంతో ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. దీనికి తోడు త్వరలోనే ఫార్మా టారిఫ్స్ కూడా ప్రకటిస్తానని ట్రంప్ చెప్పటం మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది.

ఉదయం 9.34 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 305 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 120 పాయింట్ల నష్టంలో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 192 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 470 పాయింట్లు లాస్ అయ్యాయి. నేడు మార్కెట్ల ఇంట్రాడే సమయంలో ఫార్మా, మెటల్, ఐటీ పరిశ్రమలకు చెందిన స్టాక్స్ పతనంలో కొనసాగుతున్నాయి. ఇవి ప్రధాన బెంచ్ మార్క్ సూచీలను కిందకు లాగుతున్నాయి. టారిఫ్స్ భయాలతో ఇన్వెస్టర్లు ఫార్మా స్టాక్స్ విక్రయాలకు దిగిన నేపథ్యంలో గ్లాండ్ ఫార్మా, లుపిన్ కంపెనీ షేర్లు 5 శాతం వరకు క్షీణతను నమోదు చేశాయి. 

ప్రస్తుతం అమెరికా నుంచి ఫార్మా దిగుమతులపై ఇండియా 10 శాతం సుంకాన్ని అమలులో ఉంచగా.. ట్రంప్ త్వరలో ప్రకటించే పరస్పర సుంకాల కింద భారత ఫార్మా ఎగుమతులపై 10 శాతం టారిఫ్స్ ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సీఎల్ఎస్ఏ ప్రకటించింది. ప్రస్తుతం అమెరికా ఫార్మాలపై సుంకాల ద్వారా ఇండియా రూ.400 కోట్ల రాబడిని చూస్తోంది. ఈ తరుణంలో భారత ప్రభుత్వం ఈ సుంకాలను తగ్గించటం లేదా పూర్తిగా తొలగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా చేయటం ద్వారా భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉండదు.