కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే 5.29 లక్షల కోట్లు ఆవిరి

కుప్పకూలిన స్టాక్ మార్కెట్..  ఒక్కరోజే 5.29 లక్షల కోట్లు ఆవిరి

న్యూఢిల్లీ: గ్లోబల్​ మార్కెట్ల నుంచి నెగటివ్​ సంకేతాలు,  బ్యాంకింగ్, పవర్,  ఆటో రంగాలలో భారీ అమ్మకాలు, డాలర్​పెరుగుదల కారణంగా మంగళవారం మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ సెన్సెక్స్ దాదాపు 821 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 23,900 స్థాయి కంటే దిగువకు పడిపోయింది. 

30-షేర్ల సెన్సెక్స్ 1.03 శాతం పతనమై 78,675.18 వద్ద స్థిరపడింది. ఇందులోని 25 షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో ఇది 948.31 పాయింట్లు క్షీణించి 78,547.84 వద్దకు చేరుకుంది. ఎన్​ఎస్ఈ నిఫ్టీ 257.85 పాయింట్లు తగ్గి 23,883.45 వద్ద ముగిసింది. 46 నిఫ్టీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఫలితంగా  ఇన్వెస్టర్ల సంపద రూ.5.29 లక్షల కోట్లు తగ్గి రూ.437.24 లక్షల కోట్లకు (5.18 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. సెన్సెక్స్​లో సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు మినహా మిగతావన్నీ నష్టపోయాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సోమవారం రూ. 2,306.88 కోట్ల విలువైన ఈక్విటీలను ఆఫ్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 2,026.63 కోట్ల షేర్లను కొన్నట్టు ఎక్స్ఛేంజ్ డేటా పేర్కొంది. 

మార్కెట్ అవర్స్ తర్వాత  ద్రవ్యోల్బణం, ఐఐపీ డేటా విడుదల కావడంతో పెట్టుబడిదారులు కూడా జాగ్రత్తగా ఉన్నారని విశ్లేషకులు తెలిపారు.   బీఎస్​ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 1.26 శాతం, మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.98 శాతం క్షీణించాయి.  సెక్టోరల్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లలో  పవర్ అత్యధికంగా 2.79 శాతం క్షీణించగా, యుటిలిటీస్ 2.20 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.14 శాతం, ఆటో 1.95 శాతం, ఇండస్ట్రియల్స్ 1.82 శాతం,  మెటల్ 1.52 శాతం తగ్గాయి.   రియల్టీ,  ఐటీ లాభపడ్డాయి.  బీఎస్​ఈలో మొత్తం 2,742 స్టాక్‌‌‌‌‌‌‌‌లు క్షీణించగా, 1,226 పెరిగాయి.  ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో, షాంఘై,  హాంకాంగ్​తోపాటు యూరోపియన్ ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ సోమవారం లాభాలతో ముగిసింది.  గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 0.56 శాతం పెరిగి 72.23 డాలర్లకు చేరుకుంది.

నిరాశపర్చిన సగిలిటీ ఇండియా

హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ రంగంలో టెక్నాలజీతో కూడిన సేవలను అందించే సగిలిటీ ఇండియా లిమిటెడ్ షేర్లు మంగళవారం ఇష్యూ ధర రూ.30పై మూడు శాతం తగ్గింపుతో ముగిశాయి.  బీఎస్​ఈ,  ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఇ రెండింటిలో ఇష్యూ ధర కంటే 3.53 శాతం పెరిగి రూ. 31.06 వద్ద ఈ షేరు ఎంటరయింది.  బీఎస్ఈలో ఇది రోజులో 9.66 శాతం జంప్ చేసి రూ. 32.90కి చేరుకుంది. అయితే తర్వాత అన్ని లాభాలను వదులుకుంది  2.13 శాతం తగ్గి ఒక్కొక్కటి రూ. 29.36 వద్ద ముగిసింది.  ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈలో కంపెనీ షేర్లు 3 శాతం తగ్గి రూ.29.10 వద్ద ముగిశాయి.  కంపెనీ మార్కెట్ విలువ రూ.13,744.38 కోట్లుగా ఉంది.