
Markets Fall: భారతీయ స్టాక్ మార్కెట్లు నిపుణులు ఊహించినట్లుగానే ఏప్రిల్ మాసాన్ని భారీ నష్టాల్లో ప్రారంభించాయి. ఉదయం నష్టాల మధ్య ఒడిదొడుకులతో స్టార్ట్ అయిన బెంచ్ మార్క్ సూచీలు సమయం గడిచేకొద్ది భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో మార్కెట్ల ముగింపు దగ్గరపడుతున్న వేళ ఏకంగా సెన్సెక్స్ 1400 పాయింట్లను కోల్పోయింది. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఇన్వెస్టర్లు నష్టాలతో ప్రారంభించాల్సి వచ్చింది.
నేడు మార్కెట్ల భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల మేర ఊడ్చిపెట్టుకుపోయింది. చివరికి మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ 1,390 పాయింట్ల నష్టంతో ప్రయాణాన్ని ముగించగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 354 పాయింట్ల పతనాన్ని చూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 737 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 443 పాయింట్ల నష్టంతో తమ ప్రయాణాన్ని ముగించాయి. అయితే ఈ ప్రభావంతో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సైతం నష్టాలను అందించనున్నాయి.
ALSO READ : VI Stock: రంకెలేస్తున్న వొడఫోన్ ఐడియా స్టాక్.. నేడు 20% అప్, ఇంకా పెరుగుతుందా..?
నేడు ఇంట్రాడేలో మార్కెట్ల పతనం కారణంగా ఇండియా విక్స్ సూచీ కూడా 9 శాతం పెరిగి దాదాపు 14 శాతానికి చేరింది. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన భయాలతో భారత మార్కెట్లలో కూడా ఒడిదొడుకులు భారీగా పెరిగాయి. అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
భయపడకండి ఇన్వెస్టర్స్..
యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ రేపటి నుంచి టారిఫ్స్ అమలులోకి తీసుకురానున్న వేల మార్కెట్లలో భూకంపం వచ్చింది. దీంతో భారీ పతనంలో నేడు సూచీలు ప్రయాణించటంపై డీఆర్ చోక్సీ ఫిన్ సర్వ్ ఎండీ దివిన్ చోక్సీ స్పందించారు. వాస్తవానికి అమెరికా ప్రకటించే టారిఫ్స్ కంపెనీలపై కేవలం ప్రతికూల ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుందని చెప్పలేమని అన్నారు. మారుతున్న పరిస్థితులపై ఇన్వెస్టర్లు అవగాహన పెంచుకుంటూ ఉండాలని, ప్రస్తుతానికి టారిఫ్స్ విషయంలో పెద్ద ఆందోళన చెందాల్సిన పరిస్థితులు లేవన్నారు. అందువల్ల పెట్టుబడిదారులు అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమయం గడిచే కొద్ది సుంకాల ప్రభావం తీరుతెన్నులు బయటకొస్తాయన్నారు. అమెరికా సుంకాలను పరిశ్రమలు ఎలా తీసుకుంటాయి, ఎలా ముదుకు సాగుతాయనే అంశాల కోసం కొంత వేచి చూసే ధోరణిని అవలంభించటం కీలకమని ఆయన అన్నారు.