ముంబై : వరుస మూడు సెషన్లలో నష్టాల్లో కదిలిన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు, శుక్రవారం లాభపడ్డాయి. ఐటీ షేర్లు పడినా, బ్యాంక్ షేర్లు ర్యాలీ చేయడంతో నిఫ్టీ, సెన్సెక్స్ పాజిటివ్‌గా కదిలాయి. ఫైనాన్షియల్స్, మెటల్ షేర్ల నుంచి సపోర్ట్ లభించడంతో నిఫ్టీ శుక్రవారం 104 పాయింట్లు (0.42 శాతం) పెరిగింది. 24,854 దగ్గర సెటిలయ్యింది. సెన్సెక్స్ 218 పాయింట్లు పెరిగి 81,225 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు శుక్రవారం సెషన్‌లో నికరంగా రూ.5,500 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, ఇదే టైమ్‌లో డొమెస్టిక్ ఇన్వెస్టర్లు నికరంగా రూ.5,200 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
ఎఫ్‌ఐఐలు మార్కెట్ నుంచి వెళ్లిపోతుంటే, డొమెస్టిక్ ఇన్వెస్టర్లు మాత్రం సపోర్ట్‌గా నిలుస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ షేర్లు శుక్రవారం 6 శాతం ర్యాలీ చేశాయి. కంపెనీ నికర లాభం క్యూ2 లో 19 శాతం పెరిగి రూ.7,401 కోట్లకు పెరగడమే కారణం. సెన్సెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. రిజల్ట్స్ మెప్పించకపోవడంతో ఇన్ఫోసిస్ షేర్లు 4.50 శాతం పతనమయ్యాయి. ఏషియన్ పెయింట్స్, నెస్లే, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్‌లు లాభాల్లో ముగియగా, సౌత్ కొరియా మార్కెట్ నష్టపోయింది.