ట్రంప్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు స్మాష్..రూ.9.52 లక్షల కోట్లు ఆవిరి

ట్రంప్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు స్మాష్..రూ.9.52 లక్షల కోట్లు ఆవిరి

సెన్సెక్స్​824 పాయింట్లు డౌన్​
నిఫ్టీ 263 పాయింట్లు పతనం

న్యూఢిల్లీ: అమెరికా ప్రెసిడెంట్​ డోనాల్డ్ ​ట్రంప్​ట్రేడ్ ​పాలసీపై అనిశ్చితి, కొలంబియాతో ఘర్షణలతో గ్లోబల్​ మార్కెట్లతోపాటు ఇండియా మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. ఐటీ, ఆయిల్​గ్యాస్​ షేర్లలో విపరీతమైన అమ్మకాల కారణంగా సెన్సెక్స్​ఏడు నెలల కనిష్టానికి పడిపోయింది.   

824.29 పాయింట్లు నష్టపోయి 75,366 వద్ద ముగిసింది. సెన్సెక్స్​లోని 23 షేర్లూ నష్టపోయాయి. ఇంట్రాడేలో 922 పాయింట్ల వరకు పడింది. 50 షేర్ల నిఫ్టీ 263.05 పాయింట్లు నష్టపోయి 22,829 వద్ద ముగిసింది. గత జూన్​ఆరు తరువాత మొదటిసారిగా 23 వేల దిగువకు వచ్చింది. 

ఇంట్రాడేలో 305.3 పాయింట్ల వరకు నష్టపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద రూ.9.52 లక్షల కోట్లు తగ్గింది. ఐటీ, టెలికం, యుటిలిటీస్, పవర్​, కన్జూమర్​ డ్యూరబుల్స్​, ఆయిల్​ అండ్​ గ్యాస్​, హెల్త్​కేర్​ సెక్టార్​ షేర్లు విపరీతంగా నష్టపోయాయి. 

ట్రంప్​ కొలంబియాపై సుంకాలను 25 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. అక్రమ వలసదారులు ఉన్న విమానాలను రానిస్తానని ఒప్పుకోవడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్లు బలహీనంగా ఉండటం, మూడో క్వార్టర్ ​ఫలితాలు నిరాశపర్చడంతో అమ్మకాలు ఎక్కువయ్యాయని జియోజిత్​ ఫైనాన్షియల్​సర్వీసెస్  రీసెర్చ్​ హెడ్​ వినోద్​ నాయర్​ అన్నారు. 

హెచ్​సీఎల్​ టెక్​ 4.49 శాతం డౌన్​

సెన్సెక్స్​ షేర్లలో హెచ్​సీఎల్ ​టెక్ ​4.49 శాతం నష్టపోయింది. దీంతోపాటు జొమాటో, టెక్​మహీంద్రా, పవర్​గ్రిడ్​, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్​, టాటా స్టీల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, రిలయన్స్, ఎయిర్​టెల్​ నష్టపోయాయి. మూడో క్వార్టర్​ రిజల్ట్స్​ బాగుండటంతో ఐసీఐసీఐ షేర్​1.39 శాతం లాభపడింది. 

హెచ్​యూఎల్, ఎంఅండ్​ఎం, ఎస్​బీఐ, ఎల్​అండ్​టీ కూడా లాభపడ్డాయి. బీఎస్​ఈ స్మాల్​క్యాప్​ 3.51 శాతం, మిడ్​క్యాప్​ 2.68 శాతం తగ్గాయి. సెక్టోరల్​ ఇండెక్స్​లు అన్నీ నష్టాల్లోనే ముగిశాయి. రిజల్ట్స్​ బాగాలేకపోవడంతో ఐడీఎఫ్​సీ షేర్లు 8.85 శాతం, సీడీఎస్​ఎల్​ షేర్లు 10 శాతం నష్టపోయాయి. 

యూఎస్​, యూరప్​మార్కెట్ల నుంచి బలహీనమైన సంకేతాలు, ఎఫ్​ఐఐల నిధుల తరలింపు, పేలవమైన థర్డ్​ క్వార్టర్​ రిజల్ట్స్​కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తగ్గించుకుంటున్నారని మెహతా ఈక్విటీస్ ​ఎనలిస్ట్​ ప్రశాంత్ ​తాప్సీ చెప్పారు. ఆసియా, యూరప్​ మార్కెట్లు నష్టపోయాయి. 

ఎఫ్​ఐఐలు శుక్రవారం రూ.2,758.49 కోట్ల విలువైన ఈక్విటీలు అమ్మారు. బ్రెంట్ ​క్రూడ్​ బ్యారెల్​ధర 0.22 శాతం పెరిగి 78.67 డాలర్లకు చేరింది.