న్యూఢిల్లీ: మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాలను సాధించి, మరోసారి జీవితకాల గరిష్ఠ స్థాయిలలో ముగిశాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్ వంటి షేర్లలో భారీ కొనుగోళ్ల కారణంగా గురువారం తొలిసారిగా చరిత్రాత్మక 79 వేల మార్కును సెన్సెక్స్ అందుకుంది. నిఫ్టీ 24 వేల స్థాయిని దాటింది. డెరివేటివ్స్ విభాగంలో నెలవారీ కాంట్రాక్టుల గడువు ముగియడంతో 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 568.93 పాయింట్లు పెరిగి 79,243.18 వద్ద కొత్త ముగింపు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇంట్రాడేలో ఇది 721.78 పాయింట్లు జూమ్ చేసి కొత్త జీవితకాల గరిష్ట స్థాయి 79,396.03ని తాకింది. నిఫ్టీ 175.70 పాయింట్లు పెరిగి 24,044.50 వద్ద తాజా రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 24,087.45 ను తాకింది.
1.4 శాతం పెరిగిన యూఎస్ జీడీపీ
యూఎస్ జీడీపీ ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో 1.4 శాతం (ఏడాది ప్రాతిపదికన) వృద్ధి చెందింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో 1.3 శాతం గ్రోత్ నమోదు చేసింది. 1.4 శాతం పెరుగుతుందని ఎనలిస్టులు అంచనా వేశారు. యూఎస్‌లో వినియోగం మార్చి క్వార్టర్‌లో ఏడాది ప్రాతిపదికన 2 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గింది. వడ్డీ రేట్లు గరిష్టాల్లో ఉండడంతో వినియోగం పడుతోంది.