- తిరిగి 79 వేల స్థాయికి
- 557 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
ముంబై: వరుస సెషన్లలో నష్టాల్లో ట్రేడయిన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లకు శుక్రవారం ఊరట లభించింది. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు, అమెరికా మార్కెట్‌లో సానుకూలతతో సెన్సెక్స్, నిఫ్టీ రెండున్నర శాతానికిపైగా లాభపడ్డడాయి. సెన్సెక్స్ 2.54 శాతం ఎగబాకి తిరిగి 79వేల స్థాయిని అందుకుంది. 1,961.32 పాయింట్లు పెరిగి 79,117.11 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 2,062.4 పాయింట్లు పెరిగి 79,218.19కి చేరుకుంది. బీఎస్ఈలో మొత్తం 2,446 స్టాక్‌లు పురోగమించగా, 1,475 క్షీణించాయి.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 557.35 పాయింట్లు (2.39 శాతం) పెరిగి 23,907.25 వద్దకు చేరుకుంది. మొత్తం 30 సెన్సెక్స్ కంపెనీలు గ్రీన్‌లో ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ. 7.32 లక్షల కోట్ల మేర ధనవంతులుగా మారారు. బీఎస్ఈ- లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.433 లక్షల కోట్లకు (5.12 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది. ఈవారంలో బీఎస్ఈ బెంచ్‌మార్క్ 1,536.8 పాయింట్లు, నిఫ్టీ 374.55 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టైటాన్, ఐటీసీ, ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టూబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా లాభపడ్డాయి.
బ్లూచిప్ స్టాక్స్‌లో భారీగా కొనుగోళ్లు జరగడంతో రిలయన్స్‌తో సహా పలు ఇండెక్స్ హెవీ వెయిట్స్ గణనీయంగా లాభపడ్డాయి. అమెరికాలో అవినీతి కేసు వల్ల గురువారం అదానీ గ్రూపు సంస్థల స్టాక్స్ దారుణంగా నష్టపోయినా, శుక్రవారం కోలుకున్నాయి. బీఎస్ఈలో అంబుజా సిమెంట్స్ 3.50 శాతం, ఏసీసీ 3.17 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2.16 శాతం, అదానీ పోర్ట్స్ 2.05 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 1.18 శాతం, ఎన్‌డీటీవీ 0.65 శాతం పెరగగా, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు మాత్రం 8 శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.26 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.90 శాతం పెరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి.
కొనసాగిన ఎఫ్ఐఐల అమ్మకాలు
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) గురువారం సెషన్‌లో రూ. 5,320.68 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, శుక్రవారం మరో రూ.1,278 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మార్కెట్‌లో వీరి అమ్మకాల పరంపర కొనసాగుతోంది. మరోవైపు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) మార్కెట్ కు మద్ధతుగా నిలుస్తున్నారు. వీరు కిందటి సెషన్‌లో రూ. 4,200.16 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, శుక్రవారం మరో రూ.1,722.15 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో శుక్రవారం లాభాల్లో ముగియగా, షాంఘై, హాంకాంగ్ నష్టాలపాలయ్యాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.19 శాతం పెరిగి 74.37 డాలర్లకు చేరుకుంది.
డల్‌గా జింకా లాజిస్టిక్స్ లిస్టింగ్
ట్రక్ ఆపరేటర్ల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్ నిర్వహించే జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం ఐపీఓ ధర రూ.273 కంటే 5 శాతం తగ్గి రూ.260 దగ్గర ముగిశాయి. బీఎస్ఈలో ఇష్యూ ధర కంటే 2.21 శాతం లాభంతో రూ.279.05 వద్ద లిస్టింగ్ అయిన కంపెనీ షేర్లు, ఇంట్రాడేలో రూ.285.80 వరకు వెళ్లాయి. అయితే లాభాలను నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. దాదాపు 6.50 శాతం తగ్గి రూ.255.25 వరకు పడ్డాయి.చివరికి సంస్థ షేర్లు 4.68 శాతం క్షీణించి రూ.260.20 వద్ద ముగిశాయి. జింకా కంపెనీ మార్కెట్ విలువ రూ.4,591.98 కోట్లుగా ఉంది.