సెన్సెక్స్​ 318 పాయింట్లు జంప్​

సెన్సెక్స్​ 318 పాయింట్లు జంప్​

 

  • 105 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • సుంకాల ప్రకటనతో నష్టపోయిన ఆటోస్టాక్స్​

న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులు పెరగడం, బ్లూచిప్​షేర్లలో కొనుగోళ్ల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం 317.93 పాయింట్లు పెరిగి 77,606.43 వద్ద సెటిలయింది. ఇంట్రాడేలో 458.96 పాయింట్లు పెరిగి 77,747.46 వద్ద ముగిసింది. ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ 105.10 పాయింట్లు దూసుకెళ్లి 23,591.95 వద్ద క్లోజయింది. సెన్సెక్స్ ప్యాక్‌‌లో బజాజ్ ఫిన్‌‌సర్వ్, ఇండస్‌‌ఇండ్ బ్యాంక్, ఎన్‌‌టీపీసీ, లార్సెన్ అండ్​ టూబ్రో, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, జొమాటో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, టైటాన్ అత్యధికంగా లాభపడ్డాయి. 

 దిగుమతి చేసుకున్న కార్లపై 25 శాతం సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో టాటా మోటార్స్ సహా పలు ఆటో కంపెనీల షేర్లు నష్టపోయాయి. సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌‌టెల్, హెచ్‌‌సీఎల్ టెక్, మహీంద్రా అండ్​ మహీంద్రా కూడా నష్టపోయాయి.  ఎఫ్‌‌ఐఐలు బుధవారం రూ.2,240.55 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. బీఎస్‌‌ఈ స్మాల్‌‌క్యాప్ గేజ్ 0.90 శాతం, మిడ్‌‌క్యాప్ ఇండెక్స్ 0.46 శాతం పెరిగాయి. బీఎస్‌‌ఈ సెక్టోరల్​ఇండెక్స్​లలో యుటిలిటీలు 2.09 శాతం, సేవలు 1.61 శాతం, రియాలిటీ 1.38 శాతం, చమురు, గ్యాస్ 1.32 శాతం, ఇంధనం 1.22 శాతం, పవర్​1.16 శాతం పెరిగాయి. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంగ్​కాంగ్​లాభాల్లో, సియోల్​, టోక్యో నష్టాల్లో ముగిశాయి