స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఐదు రోజులుగా భారీగా నష్టపోయిన మార్కెట్లు ఇవాళ లాభాల్లోకి వచ్చాయి. చివరి గంటలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు నష్టాల నుంచి బయటపడ్డాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ రేట్ల పెంపు సంకేతాలు, ద్రవ్యోల్బణంపై నెలకొన్న భయాలు, రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపాయి. వీటికి తోడు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండటంతో దేశీయ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. అయితే కనిష్ట స్థాయికి చేరిన షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ముందుకురావడం మార్కెట్ కు కలిసొచ్చింది.
ఉదయం 57,158.63 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఊగిసలాటకు లోనైంది. ఒకదశలో అమ్మకాల ఒత్తిడితో 56,409.63 పాయింట్ల కనిష్టానికి పతనమైంది. కొనుగోళ్ల మద్దతుతో తేరుకుని 57,966.93 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్.. మార్కెట్ ముగిసే సమయానికి 366.64 పాయింట్ల లాభంతో 57,858.15 వద్ద క్లోజయింది. మారుతి, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 6శాతానికి పైగా లాభపడ్డాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 128.85 పాయింట్ల లాభంతో 17,277.95 వద్ద ముసిగింది.