- తాజా నష్టాల నుంచి కోలుకుంటున్న ఇండెక్స్‌లు
- నిఫ్టీ శుక్రవారం ఒక శాతం అప్
ముంబై: గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవ్వడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు నిఫ్టీ, సెన్సెక్స్ శుక్రవారం లాభాల్లో కదిలాయి. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు పాజిటివ్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 820 పాయింట్లు (1.04 శాతం) పెరిగి 79,706 దగ్గర, నిఫ్టీ 251 పాయింట్లు లాభపడి 24,368 దగ్గర సెటిలయ్యాయి. గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిన నిఫ్టీ ఇంట్రాడేలో 24,400 లెవెల్‌ను దాటగా, సెన్సెక్స్ 80 వేల లెవెల్‌ను క్రాస్ చేసింది. నిఫ్టీలో ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి.
మరోవైపు బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, పవర్, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, మీడియా ఇండెక్స్‌లు 1–2 శాతం వరకు పెరిగాయి. మెయిన్ ఇండెక్స్‌ల మాదిరే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు కూడా ర్యాలీ చేశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ శుక్రవారం ఒక శాతం పెరగగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.80 శాతం లాభపడింది. బీఎస్‌ఈలోని సుమారు 250 షేర్లు ఏడాది గరిష్టాన్ని టచ్ చేశాయి. ఇందులో ఆయిల్ ఇండియా, సన్ టీవీ నెట్‌వర్క్, లుపిన్, అల్కెమ్ ల్యాబ్, గ్లెన్‌మార్క్ ఫార్మా, అజంతా ఫార్మా, కోల్గేట్ పామోలివ్, అరబిందో ఫార్మా, కోరమాండల్ ఇంటర్నేషనల్ ఉన్నాయి. కిందటి వారంతో పోలిస్తే ఈ వారం సెన్సెక్స్, నిఫ్టీ ఒకటిన్నర శాతం నష్టపోయాయి.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
1) గ్లోబల్‌గా అనిశ్చితి నెలకొందని, ఫలితంగా మార్కెట్ తీవ్రంగా కదులుతోందని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు. నిఫ్టీ 24,500 పైన ముగిసేంత వరకు జాగ్రత్త వహించాలని సలహా ఇచ్చారు.
2) నిఫ్టీ 25,100 నుంచి 23,900 వరకు పడిందని, ప్రస్తుతం ఈ లాస్ నుంచి రికవర్ అవుతోందని షేర్‌ఖాన్ బై బీఎన్‌పీ పారిబా ఎనలిస్ట్ జతిన్ గేడియా పేర్కొన్నారు. డైలీ చార్ట్‌లో 50 శాతం, 61.82 శాతం ఫిబనాసి రిట్రాస్‌మెంట్ లెవెల్స్ అయిన 24,520–24,651 వరకు ర్యాలీ ఉండొచ్చని అంచనా వేశారు. దిగువన 40 రోజుల మూవింగ్ యావరేజ్ అయిన 24,200–24,150 తక్షణ మద్దతుగా పనిచేస్తుందని తెలిపారు. బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేట్ అవుతోందని, శుక్రవారం గ్రీన్‌లో క్లోజ్ అయ్యిందని జతిన్ పేర్కొన్నారు. ఈ ఇండెక్స్ 50,750–50,800 వరకు పుల్‌బ్యాక్ అవ్వొచ్చని అన్నారు.
ఓలా 20 శాతం అప్..
ఓలా ఎలక్ట్రిక్ షేర్లు మార్కెట్‌లో లిస్టింగ్ అయిన రోజే ఇన్వెస్టర్లను భారీగా ఆకర్షించాయి. 20 శాతం ర్యాలీ చేసి అప్పర్ సర్క్యూట్‌ను టచ్ చేశాయి. కంపెనీ షేర్లు శుక్రవారం రూ.76 దగ్గర ఫ్లాట్‌గా లిస్ట్ అయినప్పటికీ, అక్కడి నుంచి పెరిగి ఇంట్రాడే గరిష్టమైన రూ.91.18 లెవెల్‌ను టచ్ చేశాయి. ఇదే లెవెల్ దగ్గర క్లోజయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.40,226 కోట్లకు చేరుకుంది. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ఈ నెల 2 న ఓపెనై 6 న ముగిసింది.