- రూ.4.21 లక్షల కోట్లు లాభపడ్డ ఇన్వెస్టర్లు
ముంబై: భారీ కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల వల్ల బెంచ్‌మార్క్ సెన్సెక్స్ సోమవారం 603 పాయింట్లు పుంజుకుంది. 80,005.04 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 1,137.52 పాయింట్లు పెరిగి 80,539.81 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 158.35 పాయింట్లు పెరిగి 24,339.15 వద్దకు చేరుకుంది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.21 లక్షల కోట్లు పెరిగింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, ఎస్బీఐ లాభపడ్డాయి. అయితే, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ వెనుకంజలో ఉన్నాయి.
వారీ హిట్..దీపక్ ఫట్
వారీ ఎనర్జీస్ షేర్లు సోమవారం ఇష్యూ ధర రూ.1,503 తో పోలిస్తే 70 శాతం పెరిగి రూ.2,550 వద్ద లిస్టింగ్ అయ్యాయి. ఇంట్రాడేలో రూ.2,600 కు చేరుకున్నాయి. మరోవైపు దీపక్ బిల్డర్స్ షేర్లు మార్కెట్‌లో ఇష్యూ ధర రూ.203 తో పోలిస్తే 2.1 శాతం తగ్గి రూ.198.50 దగ్గర లిస్టింగ్ అయ్యాయి. కానీ, ఇంట్రాడేలో 21 శాతం నష్టపోయి రూ.162 కు పడ్డాయి.