ముంబై: స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 984 పాయింట్లు నష్టపోయింది. 324 పాయింట్లను నిఫ్టీ కోల్పోయింది. 77,691 దగ్గర సెన్సెక్స్ ముగియగా, 23,559 దగ్గర నిఫ్టీ ముగిసింది.1069 పాయింట్లను బ్యాంక్ నిఫ్టీ నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ రెండు నెలల కనిష్టానికి పడిపోయి, 50 వేల మార్క్ దగ్గర ట్రేడ్ అయింది. మొత్తంగా చూసుకుంటే.. భారత స్టాక్ మార్కెట్స్ డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. 6.8 లక్షల కోట్ల రూపాయల సంపద కొన్ని గంటల వ్యవధిలోనే ఆవిరైంది.
వరుసగా ఐదో రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. రూపాయి బలహీనపడటం, డాలర్ ఇండెక్స్ పెరుగుదల, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, అమెరికాలో మారిన రాజకీయ పరిస్థితులు, విదేశీ పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాలు.. ఇలా అంతర్జాతీయంగా నెలకొన్న అనేక పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఇన్వె్స్టర్ల ఆశలను ఆవిరి చేశాయి. పైగా.. ఇండియాలో రిటైల్ ద్రవ్యోల్పణం పెరగడం కూడా స్టాక్ మార్కెట్ల పతనానికి మరో ప్రధాన కారణం.
అధిక ఆహార ధరల కారణంగా గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.49 శాతం నుంచి అక్టోబర్‌లో 6.21 శాతానికి పెరిగింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అప్పర్ టాలరెన్స్ లెవెల్ కంటే ఎక్కువ. అంతేగాక 14 నెలల గరిష్టానికి ఎగిసింది. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ పతనాన్ని నిశితంగా గమనిస్తున్న నిపుణులు ఇన్వెస్టర్లకు ఇస్తున్న సలహా ఏంటంటే.. సిమెంట్, మెటల్స్, పెట్రోలియం రిఫైనింగ్ సెక్టార్స్ స్లోడౌన్లో ఉన్నాయని, ఈ రంగాలపై ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.
ALSO READ | 14 నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
బ్యాంకింగ్, డిజిటల్ కంపెనీలు, హోటల్స్, ఫార్మాస్యుటికల్స్, ఐటీ రంగాలు వృద్ధిలో ఉండటం వల్ల.. ఈ రంగాలపై ఇన్వెస్ట్ చేయడం మేలేమోనని నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులను నిశితంగా గమనించి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.