- 397 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- రూ.7.30 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై: అమెరికాలో మాంద్యం భయాలు తగ్గడం, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంతో మనదేశ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం దూసుకెళ్లాయి. బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 1,330 పాయింట్లు పుంజుకుని రెండు వారాల గరిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 397 పాయింట్లు ఎగసి 24,500 స్థాయికి ఎగువన స్థిరపడింది. గ్లోబల్ స్టాక్స్ ర్యాలీతో ఐటీ షేర్లకు డిమాండ్ పెరిగింది. సెన్సెక్స్ 1.68 శాతం పెరిగి 80,436.84 వద్ద స్థిరపడింది. గత రెండు నెలల్లో ఇదే అత్యధిక సింగిల్డే లాభం. ఇంట్రాడేలో ఇది 1,412.33 పాయింట్లు జూమ్ చేసి 80,518.21కి చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 397.40 పాయింట్లు పెరిగి 2 వారాల గరిష్ట స్థాయి 24,541.15 వద్ద ముగిసింది. 47 నిఫ్టీ షేర్లు గ్రీన్‌లో ముగియగా, మూడు రెడ్‌లో ముగిశాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.7.30 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ సంస్థల నుంచి టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ అత్యధికంగా లాభపడ్డాయి. సన్ ఫార్మా మాత్రమే వెనకబడింది. జపనీస్ యెన్ స్థిరత్వం గ్లోబల్ మార్కెట్ రికవరీ కావడంలో కీలకపాత్ర పోషించిందని, బలమైన యూఎస్ రిటైల్ అమ్మకాలు, నిరుద్యోగం తగ్గడంతో మార్కెట్లో ఊపు కనిపించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
అన్ని ఇండెక్స్‌లు లాభాల్లోనే..
అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ ఇండెక్స్ 2.72 శాతం ఎగబాకగా, రియల్టీ 2.45 శాతం ఎగబాకింది. టెక్ 2.23 శాతం, ఆటో 1.90 శాతం, కమోడిటీలు 1.89 శాతం, కరెంటు 1.80 శాతం, ఆర్థిక సేవలు 1.77 శాతం, వినియోగదారుల విచక్షణ 1.74 శాతం పెరిగాయి. బ్రాడర్ మార్కెట్లో బీఎస్ఈ మిడ్‌క్యాప్ గేజ్ 1.80 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.70 శాతం పెరిగాయి. బీఎస్ఈలో మొత్తం 2,462 స్టాక్‌లు పురోగమించగా, 1,467 క్షీణించగా, 107 మారలేదు. ఈవారం బీఎస్ఈ సెన్సెక్స్ 730.93 పాయింట్లు, నిఫ్టీ 173.65 పాయింట్లు పెరిగాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు బుధవారం రూ. 2,595.27 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 2,236.21 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఆసియాలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ లాభపడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు ఎక్కువగా గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.22 శాతం క్షీణించి 80.05 డాలర్లకు చేరుకుంది.