- దేశంలోనే మొదటి సెన్సరీ పార్క్
- దివ్యాంగుల కోసం సెన్సరీ పార్క్ ఏర్పాటు చేసిన ఒడిశా ప్రభుత్వం
పార్కులో జారుడు బల్ల మీద నుంచి కిందకి జారుతూ.. సీ–సా మీద కూర్చొని ఆడుతూ... ఉయ్యాల ఊగుతూ ఎంతో సంబరపడిపోతారు పిల్లలు. కానీ చూపు, వినికిడి శక్తి లేని పిల్లలు, దివ్యాంగులైనవాళ్లు మిగతా పిల్లల లెక్క పార్కులో ఆడుకోలేరు. అయితే... వీళ్లకోసం స్పెషల్ పార్క్ ఒకటి ఉంది. ఈ పార్కులో మాత్రం వీళ్లు కూడా అందరు పిల్లల్లా చిరునవ్వులు చిందిస్తూ నచ్చినంత సేపు ఆడుకుంటున్నారు.అదెలా సాధ్యమైందంటే... అది సెన్సరీ పార్క్ కావడం వల్లే. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉంది ఈ పార్క్.
దివ్యాంగులైన పిల్లలు, మానసికంగా ఎదగని పిల్లలు చురుకుగా ఉండాలంటే ఆటలు ఆడడం తప్పనిసరి. కానీ, పార్క్‌లో దెబ్బ తగలకుండా, కిందపడకుండా ఆడుకోవడం వీళ్లకు కష్టమే. అందుకని వాళ్లకు అనువైన పార్క్ ఏర్పాటుచేస్తే.. అందులో ఎంచక్కా ఆడుకుంటారు అనుకున్నారు అక్కడి మున్సిపల్ అధికారులు. భువనేశ్వర్‌లోని షాహిద్ నగర్లో ఈ సెన్సరీ పార్క్ ఏర్పాటుచేశారు. ‘స్మార్ట్ సిటీ మిషన్’లో భాగంగా ఈ పార్క్‌ని డెవలప్ చేశారు.
గోడల మీద బ్రెయిలీ లిపి
దివ్యాంగులు ఇందులో నడిచేటప్పుడు తూలి కిందపడకుండా ఉండేందుకు నేల మీద ఇథిలీన్ ప్రొపైలీన్ డైఈన్ మోనోమర్ (ఇపిడిఎం) రబ్బర్ మ్యాట్స్ వేశారు. ఈ పార్క్‌లో చక్రాల కుర్చీ ఉయ్యాల, ఇద్దరు కూర్చొనే ఉయ్యాల, సంగీతం వినిపించే స్తంభాలు, బాస్కెట్ బాల్ కోర్ట్‌తో పాటు జిమ్ కూడా ఉంది. అంతేకాదు గోడల మీద చెక్కిన బ్రెయిలీ లిపి అక్షరాల్ని తాకి, ఎక్కడ ఏ ఆటవస్తువు ఉంది? ఎటు వెళ్లాలి? అనేవి తెలుసుకోవచ్చు. దివ్యాంగులైన పెద్దవాళ్లు కూడా సేదతీరుతున్నారు. ఆటిజం, పార్కిన్సన్స్ వంటి సమస్యలు ఉన్నవాళ్లు కూడా ఈ సెన్సరీ పార్క్‌లో ఆడుకుంటున్నారు. దివ్యాంగులకు సౌకర్యంగా ఉండేలా తాగేనీళ్లు, టాయిలెట్స్‌ని ఏర్పాటుచేశారు. ఈ పార్క్ ఉదయం 5 గంటల నుంచి 11 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది.